Twitter: ట్విటర్‌ ఎండీకి యూపీ పోలీసుల నోటీసు!

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌ భారత విభాగానికి ఎండీగా ఉన్న మనీషా మహేశ్వరికి ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొంతమంది ట్విటర్‌ను పయోగించుకున్నారని....

Updated : 18 Jun 2021 11:48 IST

లఖ్‌నవూ: ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌ భారత విభాగానికి ఎండీగా ఉన్న మనీషా మహేశ్వరికి ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొంతమంది ట్విటర్‌ను ఉపయోగించుకున్నారని.. దీనిపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు లోనీ బోర్డర్‌ పోలీస్‌ స్టేషన్‌లో వివరణను రికార్డు చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

‘‘సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కొంతమంది ట్విటర్‌ను ఉపయోగించుకున్నారు. ట్విటర్‌ సంస్థగానీ, భారత్‌లోని దాని విభాగంగానీ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఈ విద్వేషపూరితమైన సందేశం వైరల్‌గా మారేందుకు ఆస్కారం ఏర్పడింది’’ అని మహేశ్వరికి పంపిన నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.

సందేశాన్ని పంపినవారితో పాటు మొత్తం ఎనిమిది మందిని ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. అలాగే ట్విటర్‌ను సైతం ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనడం గమనార్హం. భారత్‌లో కొత్త డిజిటల్‌ నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ట్విటర్‌పై కేసు నమోదవడం ఇదే తొలిసారి.

నూతన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) నిబంధనలు పాటించనందుకు ‘సురక్షిత ఆశ్రయం’(సేఫ్‌ హార్బర్‌) అన్న రక్షణ కవచాన్ని ట్విటర్‌ కోల్పోయింది. నూతన నిబంధనల ప్రకారం ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకంగా అధికారులను నియమించాలని పలుమార్లు సూచించినా పట్టించుకోకపోవడంతో కేంద్రం ఈ సౌకర్యాన్ని తొలగించింది. దీని ప్రకారం ఎవరైనా చట్టవ్యతిరేకమైన సమాచారాన్ని పెడితే తృతీయ పక్షం కింద ట్విటర్‌పై భారతీయ శిక్షా స్మృతి ప్రకారం చర్యలు తీసుకొనే వీలు కలుగుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని