UP Polls: 2023 నాటికి రామమందిర నిర్మాణం పూర్తి..!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మితమవుతోన్న రామమందిరం 2023నాటికి పూర్తవుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ ప్రకటించారు.

Published : 19 Feb 2022 01:17 IST

ఎన్నికల ప్రచారంలో యోగీ ఆదిత్యానాథ్‌ ప్రకటన

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మితమవుతోన్న రామమందిరం 2023నాటికి పూర్తవుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్హాల్‌ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. రామ మందిరం దేశానికే గొప్ప ఆలయంగా ప్రసిద్ధి చెందనుందన్నారు. ఇక వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయ అభివృద్ధి పనుల ఆవిష్కరణతో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన భాజపా.. అయోధ్య రామమందిరాన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తామనే హామీని ప్రజల ముందుకు తీసుకెళ్తోంది.

వరుసగా రెండోసారి అధికారపగ్గాలు కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్న భాజపాకు ఈసారి ఎన్నికల్లో కర్హాల్‌ నియోజకవర్గం ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ స్థానం నుంచి ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ బరిలో దిగడంతో భాజపా తరుపున కేంద్రమంత్రి ఎస్‌పీఎస్‌ బఘేల్‌ను పోటీలో నిలిపింది. దీంతో ఎన్నికల ప్రచారాన్ని ఇరు పార్టీలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. కేంద్రంలో-రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం ఉండడం వల్ల రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా 2017లో అధికారంలోకి వచ్చిన వెంటనే 86లక్షలకుపైగా రైతుల రుణాలను మాఫీ చేశామని గుర్తుచేశారు.

ఇదిలాఉంటే, ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకుగానూ ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండో దశలు పూర్తికాగా.. ఫిబ్రవరి 20న మూడోదశ పోలింగ్‌ జరుగనుంది. అఖిలేశ్‌ యాదవ్‌, కేంద్ర మంత్రి మధ్య పోటీ జరుగుతోన్న కర్హాల్‌ నియోజకవర్గంలో ఫిబ్రవరి 20న పోలింగ్‌ జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని