UP Judge: మహిళా జడ్జికి లైంగిక వేధింపులు.. ‘చనిపోయేందుకు అనుమతినివ్వండి’ అంటూ సీజేఐకి లేఖ

UP Woman Judge: సీనియర్‌ న్యాయమూర్తులు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఓ మహిళా జడ్జి రాసిన బహిరంగ లేఖ యూపీలో సంచలనం సృష్టించింది. చనిపోయేందుకు తనకు అనుమతినివ్వాలంటూ ఆమె సీజేఐకి లేఖ రాశారు.

Updated : 15 Dec 2023 19:52 IST

దిల్లీ: సాధారణంగా సమాజంలో న్యాయమూర్తి అంటే భయభక్తులు.. ప్రత్యేక గౌరవం ఉంటాయి.. అలాంటి న్యాయమూర్తికే పనిప్రదేశంలో అత్యంత అవమానకర పరిస్థితులు ఎదురయ్యాయి. దీంతో సదరు న్యాయమూర్తి ఆత్మహత్య చేసుకొనేందుకు సిద్ధమైనట్లు కథనాలు వెలువడ్డాయి. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని ఓ మహిళా న్యాయమూర్తి (Woman Judge)కి పనిప్రదేశంలో లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. తనతో పనిచేస్తున్న కొందరు సీనియర్లు లైంగికంగా వేధిస్తున్నారని (Sexual Harassment) ఆరోపిస్తూ ఆమె సుప్రీంకోర్టు (Supreme Court) ప్రధాన న్యాయమూర్తి (CJI)కి బహిరంగ లేఖ రాశారు. దీంతో ఈ ఘటనపై తక్షణమే నివేదిక ఇవ్వాలని సీజేఐ సంబంధిత అధికారులను ఆదేశించారు. వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లోని బాందా జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా సివిల్‌ జడ్జి రాసిన ఓ లేఖ తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ‘‘సామాన్య ప్రజలకు న్యాయం చేసేందుకు న్యాయ వృత్తిలో చేరిన నేను.. ఇప్పుడు అదే న్యాయం కోసం ప్రతి తలుపు తట్టాల్సి వస్తోంది. గత కొన్ని నెలలుగా జిల్లా న్యాయమూర్తి, ఆయన అనుచరులు నాపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. నన్ను పురుగు కంటే హీనంగా చూస్తున్నారు. రాత్రి పూట జిల్లా న్యాయమూర్తిని ఒంటరిగా కలవమంటున్నారు’’ అని ఆ మహిళా జడ్జి తన లేఖలో పేర్కొన్నారు.

‘ఇది ఆధునిక దుశ్శాసనుల లోకం’.. మహిళను వివస్త్రను చేసిన ఘటనపై హైకోర్టు వ్యాఖ్య

‘‘దీని గురించి ఈ ఏడాది జులైలో హైకోర్టు అంతర్గత ఫిర్యాదుల కమిటీ దృష్టికి తీసుకెళ్లాను. కానీ, ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ కేసులో సాక్షులు ఆ జిల్లా న్యాయమూర్తి కింద పనిచేసేవారే. తమ బాస్‌కు వ్యతిరేకంగా వారు సాక్ష్యం చెప్పగలరని నేను ఎలా నమ్మగలను? అందుకే దర్యాప్తు పూర్తయ్యేంత వరకు సదరు న్యాయమూర్తిని మరో చోటుకు బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశా. కానీ, సెకన్ల వ్యవధిలో నా అభ్యర్థనను కొట్టివేశారు. గత ఏడాదిన్నరగా నేనో జీవచ్ఛవంలా బతుకుతున్నా. నేను బతికుండి ప్రయోజనం లేదు. గౌరవప్రదంగా చనిపోయేందుకు నాకు అనుమతినివ్వండి’’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన ఈ లేఖ తన దృష్టికి రావడంతో సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ చర్యలు చేపట్టారు. దీనిపై తక్షణమే తనకు నివేదిక కావాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌ అతుల్ ఎం కుర్హేకర్‌ను ఆదేశించారు. దీంతో ఆ మహిళా న్యాయమూర్తి ఫిర్యాదు, దానిపై విచారణకు సంబంధించిన మొత్తం వివరాలను సమర్పించాలని అలహాబాద్‌ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌కు కుర్హేకర్ లేఖ రాశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు