
ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్న దిల్లీ!
కొన్ని గంటలకు మాత్రమే సరిపోతుంది
అత్యవసరంగా అందించాలని కోరిన సీఎం కేజ్రీవాల్
దిల్లీ: దేశ రాజధానిలో ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. కొన్ని ఆసుపత్రుల్లో కేవలం కొన్ని గంటలకు సరిపడే ఆక్సిజన్ మాత్రమే ఉందని వైద్యవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి విపత్కర సమయంలో అత్యవసరంగా దిల్లీకి ఆక్సిజన్‌ను అందించాలని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేశారు. కొన్నిరోజులుగా ఆక్సిజన్ వినియోగం భారీగా పెరగడంతో చాలా ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడినట్లు అధికారులు వెల్లడించారు.
‘దిల్లీలో మెడికల్ ఆక్సిజన్ కొరత తీవ్రరూపం దాల్చింది. అత్యవసరంగా దిల్లీకి ఆక్సిజన్ అందించాలని కేంద్రాన్ని మరోసారి వేడుకుంటున్నా. పలు ఆసుపత్రుల్లో కొన్ని గంటలకు మాత్రమే సరిపడే ఆక్సిజన్ అందుబాటులో ఉంది’ అని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విటర్ ద్వారా కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
రెండో దఫా కరోనా ఉద్ధృతితో కొవిడ్ రోగులతో దిల్లీ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. చాలా ఆసుపత్రుల్లో మెడికల్ ఆక్సిజన్ వినియోగం పెరిగింది. ఈ సమయంలో ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు 24 మంది సభ్యులతో కూడిన కమిటీని దిల్లీ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. కొవిడ్ సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఆక్సిజన్‌ను హేతుబద్ధంగా వాడేవిధంగా ఈ కమిటీ చర్యలు తీసుకుంటుంది. అయినప్పటికీ గత రెండురోజులుగా ఆక్సిజన్ కొరత తీవ్రరూపం దాల్చింది. ఈ సమస్యను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి దిల్లీ అధికారులు తీసుకెళ్లారు. ఇక ఈ విషయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదిలాఉంటే, మొదటి దఫాతో పోలిస్తే ఈసారి రోగులకు అధికస్థాయిలో ప్రాణవాయువు అవసరమవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తొలి దఫా విజృంభణలో పొడిదగ్గు, గొంతునొప్పి, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు ఎక్కువగా కనిపించాయి. రెండో దఫాలో మాత్రం శ్వాసకోశ ఇబ్బందులు పెరిగాయని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మెడికల్ ఆక్సిజన్ అవసరం ఎక్కువైనట్లు తెలిపింది. తొలిదఫాలో 41.5శాతం రోగులకు ఆక్సిజన్ అవసరం కాగా.. సెకండ్ వేవ్‌లో అది 54.5 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.