Talibans: ముగుస్తున్న గడువు.. విమానాశ్రయం స్వాధీనానికి తాలిబన్ల రెడీ!

కాబుల్ విమానాశ్రయాన్ని స్వాధీనంలోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తాలిబన్లు ప్రకటించారు. పరిపాలన కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.....

Updated : 29 Aug 2021 22:47 IST

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌లో తమ బలగాల ఉపసంహరణను అమెరికా వేగంగా చేపడుతోంది. ఆగస్టు 31లోపు ఈ ప్రక్రియ పూర్తిచేస్తామని అగ్రరాజ్యం తెలపగా.. ఇప్పటికే ఆ ప్రక్రియ పూర్తయినట్లు చాలా దేశాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే కాబుల్ విమానాశ్రయాన్ని స్వాధీనంలోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తాలిబన్లు ప్రకటించారు. పరిపాలన కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు తమతో దౌత్యపరమైన సంబంధాలు కొనసాగించాలని ఆకాంక్షించారు.

అఫ్గాన్‌లో శాంతి, సుస్తిరత కోసం అమెరికా 20 ఏళ్లపాటు సైనిక కార్యక్రమాలను చేపట్టింది. అయితే కొద్దిరోజుల క్రితం చెప్పినట్లుగానే బలగాల ఉపసంహరణను వేగంగా చేపడుతోంది. ఈనెల 31 కల్లా తమ బలగాలు, పౌరులు, శరణార్థుల తరలింపు పూర్తిచేసే దిశగా అడుగులు వేస్తోంది. అయితే బలగాల ఉపసంహరణ ముగింపు కోసం కచ్చితమైన తేదీ, సమయం ఇంకా నిర్ణయించలేదని అగ్రరాజ్యం వివరించింది. శరణార్థులు, ఆపదలో ఉన్నవారి తరలింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే బలగాలు అమెరికా బయలుదేరుతాయని వెల్లడించింది.

మరోవైపు ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులతో కలిసి కాబుల్‌ విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తాలిబన్‌ నేతలు ప్రకటించారు. అమెరికన్ల నుంచి తుది సమాచారం కోసం వేచిచూస్తున్నట్లు తెలిపారు. వీలైనంత త్వరగా కాబుల్‌ విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకుంటామని తాలిబన్‌ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌ పేర్కొన్నారు. అఫ్గాన్‌లోని 34 ప్రావిన్సుల్లో ఒకచోట మినహా మిగతా ప్రాంతాల్లో గవర్నర్లు, పోలీసు అధికారులను నియమించినట్లు వెల్లడించారు. దేశ ఆర్థిక సమస్యల పరిష్కారానికి వీరు కృషి చేస్తారని తెలిపారు. మరోవైపు ఆర్థిక లోటుతో సతమతమవుతున్న తాలిబన్లు దౌత్యపరంగా సంబంధాలు కొనసాగించాలని అమెరికా సహా పశ్చిమ దేశాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. తాలిబన్ల పాలనలో మానవ హక్కులకు భంగం కలిగించకుంటేనే సంబంధాలు ఉంటాయని బ్రిటన్‌ ఇదివరకే స్పష్టం చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని