Vaccination: భారత్‌కు సాయం ప్రకటించిన అమెరికా 

కరోనాపై పోరాటంలో భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా తనవంతు సహకారం అందిస్తోంది. తాజాగా మన దేశంలో వ్యాక్సినేషన్‌కు......

Published : 28 Jul 2021 21:12 IST

దిల్లీ: కరోనాపై పోరాటంలో భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా తనవంతు సహకారం అందిస్తోంది. తాజాగా మన దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు అదనంగా 25 మిలియన్‌ డాలర్ల సాయం ప్రకటించింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు విచ్చేసిన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ బుధవారం భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌తో భేటీ అయ్యారు. అనంతరం సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంటోనీ బ్లింకెన్‌ మాట్లాడుతూ.. కరోనాపై పోరాటానికి ఇప్పటివరకు 200 మిలియన్‌ డాలర్లకు పైగా సాయం అందించినట్టు చెప్పారు. తాజాగా మరో 25 మిలియన్ల డాలర్లు సాయాన్ని అదనంగా ప్రకటించడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు.

వ్యాక్సిన్‌ సరఫరా లాజిస్టిక్స్‌ను బలోపేతం చేసుకొనేందుకు, తప్పుడు సమాచారం, వ్యాక్సిన్‌ సంకోచం వంటి సమస్యల్ని అధిగమించడంతో పాటు మరింత మంది ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేందుకు ఈ సాయం ఇస్తున్నట్టు తెలిపారు. ఇరు దేశాల్లో కరోనా మహమ్మారి తీవ్రత అధికంగానే ఉందని, దీన్ని అంతం చేసేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. కరోనా మహమ్మారి వ్యాప్తిచెందిన తొలినాళ్లలో భారత్‌ చేసిన సహకారాన్ని మరువలేమన్నారు.

అనంతరం జైశంకర్‌ మాట్లాడుతూ.. తక్కువ ధరలకే ప్రపంచంలో టీకాలు అందుబాటులో ఉంచే అంశంపైనా చర్చించినట్టు తెలిపారు. భారతీయ ప్రయాణికుల పట్ల అమెరికా సానుకూల ధోరణితో వ్యవహరిస్తుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తి, లభ్యతపై ఇరు దేశాలూ కలిసి పనిచేస్తాయని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని