B.1.617 రకంపై టీకాలు పనిచేస్తున్నాయ్‌!

కొత్తగా వెలుగుచూసిన B1617 రకంపై అమెరికాలో అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

Updated : 22 Aug 2022 16:29 IST

అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ వెల్లడి

వాషింగ్టన్‌: కొత్తగా వెలుగుచూసిన b.1.617 రకంపై అమెరికాలో అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లు పనిచేస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా అమెరికాలో అనుమతి పొందిన మూడు వ్యాక్సిన్‌లు ఈ రకాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు గుర్తించామని అమెరికాలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ వెల్లడించింది. భారత్‌లో అత్యంత తీవ్రంగా ఉన్న ఈ రకాన్ని వ్యాక్సిన్‌లు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు నివేదికలు రావడం ఊరట కలిగించే విషయం.

‘b.1.617 కొత్తరకంపై వ్యాక్సిన్ల పనితీరుపై వస్తోన్న సమాచారం ఆశాజనకంగా ఉంది. అమెరికాలో అనుమతి పొందిన ఫైజర్‌, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్‌లు ఈ రకాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు గుర్తించాం’ అని అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌(NIH) డైరెక్టర్‌ డాక్టర్‌ ఫ్రాన్సిస్‌ కల్లిన్స్‌ పేర్కొన్నారు. మిగతా రకాలతో పోలిస్తే కొంత తక్కువ ప్రభావశీలత కలిగి ఉన్నప్పటికీ అమెరికన్లను రక్షించడంలో ఇది సరిపోతాయని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఇది నిజంగా ఊరట కలిగించే విషయమని ఎన్‌ఐహెచ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఫ్రాన్సిస్‌ స్పష్టం చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా వెలుగుచూస్తోన్న కరోనా రకాలపై వ్యాక్సిన్ల పనితీరును ఆయా దేశాలు ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నాయి. ఇందులో భాగంగా భారత్‌లో విస్తృతి ఎక్కువగా ఉన్న b.1.617 వేరియంట్‌పై అమెరికా నిపుణులు పరిశోధన చేపట్టారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్ల పనితీరుపై వచ్చిన సమాచారం ప్రకారం కొత్తరకంపై వ్యాక్సిన్‌లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ప్రాథమిక సమాచారం బట్టి నిర్ధారణకు వచ్చారు.

ఇదిలాఉంటే, b.1.617 రకం కరోనాను ‘భారత్‌ రకం వైరస్‌’గా వ్యాఖ్యానిస్తుండడాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ ఆక్షేపించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తమ నివేదికల్లో ఎక్కడా ‘భారత్‌ రకం’ అని వినియోగించలేదని గుర్తుచేసింది. అందుకే ఆధారాలు లేకుండా అలా పిలవడం సరికాదని స్పష్టంచేసింది. ఇలాంటి వార్తలపై స్పందించిన డబ్ల్యూహెచ్‌వో.. వైరస్‌లను, వాటి రకాలను అవి తొలిసారిగా బయటపడ్డ దేశాల పేర్లతో గుర్తించడం సరికాదని స్పష్టం చేసింది. శాస్త్రీయ నామాలతోనే వాటిని వ్యవహరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని