‘మేడిన్‌ చైనా’ ఓ హెచ్చరిక నినాదం

చైనాలోని షిన్‌జియాంగ్‌ ప్రాంతం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే పత్తిపై నిషేధం విధించారు.

Updated : 24 Sep 2022 16:37 IST

 మరో చైనా ఉత్పత్తిపై అమెరికా నిషేధం!

వాషింగ్టన్‌: చైనాపై గుర్రుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ డ్రాగన్‌ దేశంపై చర్యలకు ఉపక్రమిస్తూనే ఉన్నారు. తాజాగా చైనాలోని షిన్‌జియాంగ్‌ ప్రాంతం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే పత్తిపై నిషేధం విధించారు. చైనా సైన్యానికి అనుబంధ సంస్థగా ఉండడంతో పాటు అక్కడ వీగర్‌ ముస్లింలను బానిసలుగా చూస్తున్నారన్న కారణాలతో ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

అమెరికా అధ్యక్షుడిగా తన పదవీకాలం దగ్గరపడుతోన్న సమయంలో ట్రంప్ చైనాపై చర్యలను ముమ్మరం చేశారు. ఇప్పటికే అమెరికాలో పెట్టుబడులు పెట్టకుండా దాదాపు 34 సంస్థలను నిషేధిత జాబితాలో చేర్చిన ఆయన తాజాగా షిన్‌జియాంగ్‌ ఉత్పత్తులను కూడా నిషేధించారు. చైనాలో అతిపెద్ద పత్తి ఉత్పత్తిదారుల్లో ఒకటైన షిన్‌జియాంగ్‌ ప్రొడక్షన్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ నుంచి పత్తి ఉత్పత్తులను నిషేధిస్తున్నట్లు అమెరికా కస్టమ్స్‌ విభాగం(CBP) ప్రకటించింది. షిన్‌జియాంగ్‌లో XPCC సంస్థ దాదాపు 60 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. చైనాలో ఉత్పత్తి అవుతోన్న పత్తిలో దాదాపు 80శాతం షిన్‌జియాంగ్‌ ప్రాంతం నుంచే దిగుబడి అవుతుంది.

ఈ చర్యలను సమర్థించుకున్న అమెరికా, చైనా కమ్యూనిస్ట్‌ ప్రభుత్వం చేతిలో మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలను అమెరికా ప్రజలు సహించరని స్పష్టంచేసింది. అలాంటి బానిస కార్మికుల శ్రమ నుంచి వచ్చే లాభాలను అమెరికా అంగీకరించదని అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ అధికారి కెన్‌ కాసినెల్లీ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ‘మేడ్‌ ఇన్‌ చైనా’ అనేది దేశాన్ని సూచించే నినాదం కాదని..అదో ‘హెచ్చరిక ముద్ర’ అని అభివర్ణించారు.

ఇదిలాఉంటే, షిన్‌జియాంగ్‌ ప్రాంతంలో వీగర్‌ వర్గంపై జరుగుతున్న దాడిని నిరసిస్తూ ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో అమెరికాతో పాటు మరికొన్ని ఆసియా దేశాలపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా, కొత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టే బైడెన్‌కు ట్రంప్‌ చర్యలు ఇబ్బంది కలిగించే అంశాలని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని