మయన్మార్‌ ప్రజలకు అండగా ఉంటాం: యూఎస్‌

మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారడంపై అగ్రరాజ్యం స్పందించింది. ఆ దేశంలో శాంతియుత, ప్రజాస్వామ్య పాలన కోసం పోరెత్తిన ప్రజలకు అండగా ఉంటామని అమెరికా ప్రకటించింది.

Published : 22 Feb 2021 09:46 IST

వాషింగ్టన్‌: మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారడంపై అగ్రరాజ్యం స్పందించింది. ఆ దేశంలో శాంతియుత, ప్రజాస్వామ్య పాలన కోసం పోరెత్తిన ప్రజలకు అండగా ఉంటామని అమెరికా ప్రకటించింది. అంతేకాకుండా మయన్మార్‌లో సైనిక పాలకులు కొనసాగిస్తున్న హింసాకాండను ఆపాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ ప్రతినిధి నెడ్‌ ప్రైజ్‌ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. 

‘శాంతియుత, ప్రజాస్వామిక పరిపాలన కోసం మయన్మార్‌ దేశీయులు చేస్తున్న పోరాటానికి మా మద్దతును కొనసాగిస్తున్నాం. తమ దేశంలో హింసా కాండను ఆపాలని మిలిటరీ పాలకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతో పాటు అక్రమంగా కేసులు వేసి నిర్బంధించిన జర్నలిస్టులను, కార్యకర్తలను విడుదల చేసి.. ప్రజల మనోభావాలను గౌరవించాలి’ అని ప్రైజ్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ పోరులో మయన్మార్‌ ప్రజలకు యూఎస్‌ అండగా ఉంటుందని చెప్పారు. 

మయన్మార్‌ నేత ఆంగ్‌ సాన్‌ సూకీని ఫిబ్రవరి 1న నిర్బంధించి ఆ దేశంలో సైన్యం పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి ప్రజాస్వామ్య పాలన కోరుతూ ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం మాండలే నగరంలో నిరసనలు చేస్తున్న వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ హింసాత్మక ఘటనలో ముగ్గురు పౌరులు మరణించగా.. మరో 150 మంది గాయాల పాలయ్యారు. ఈ క్రమంలో అక్కడ చోటుచేసుకున్న హింసను ఐరాస కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ఖండించారు. నిరసనకారులపై హింస ఆమోదయోగ్యం కాదని తెలిపారు. మరోవైపు ఈ హింసను నిరసిస్తూ మయన్మార్‌ మిలిటరీకి చెందిన ఫేస్‌బుక్‌ ఖాతాను నిషేధిస్తూ ఆ సంస్థ ప్రకటించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని