US Corona: మూడు వారాల్లో రెట్టింపైన కేసులు! 

అమెరికాలో గతకొద్ది రోజులుగా రోజువారీ కేసులు మళ్లీ పెరిగాయి. కేవలం గడిచిన మూడు వారాల్లోనే కేసుల సంఖ్య రెట్టింపయ్యింది.

Updated : 15 Jul 2021 19:06 IST

అమెరికాలో మళ్లీ పెరుగుతోన్న కొవిడ్‌ ఉద్ధృతి

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ దాటికి అగ్రరాజ్యం అమెరికా ఎక్కువగా ప్రభావితమైన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా కేసులు, మరణాలు అక్కడే చోటుచేసుకున్నాయి. అయితే, వేగంగా వ్యాక్సిన్‌ పంపిణీ చేయడంతో వైరస్‌ తీవ్రత అదుపులోకి వచ్చినట్లు కనిపించింది. కానీ, గతకొద్ది రోజులుగా రోజువారీ కేసులు మళ్లీ పెరిగాయి. కేవలం గడిచిన మూడు వారాల్లోనే కేసుల సంఖ్య రెట్టింపయ్యింది. ముఖ్యంగా డెల్టా వేరియంట్‌ విస్తృతి, వ్యాక్సినేషన్‌ రేటు తగ్గడం, జులై 4న జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలతో కొవిడ్‌ వ్యాప్తి మరోసారి పెరగడానికి కారణమయ్యాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

వ్యాక్సినేషన్‌ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో..

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 55శాతానికి మించి కనీసం ఒకడోసు వ్యాక్సిన్‌ తీసుకున్నారు. వ్యాక్సినేషన్‌ రేటు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అంతేకాకుండా మరణాల సంఖ్య కూడా కొనసాగుతోంది. అమెరికాలో నిత్యం సరాసరి 260 మంది కొవిడ్‌ రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం, అమెరికాలో గతనెల వరకూ రోజువారీ సరాసరి కేసుల సంఖ్య 11వేలుగా ఉంది. కానీ, ప్రస్తుతం అది 23వేలకు చేరింది. మైమీ, దక్షిణ డకోటా రాష్ట్రాల్లో రెండు వారాలుగా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మిస్సిసిపిలోనూ కొవిడ్‌ ఉద్ధృతి మరింత పెరిగింది. గడిచిన మూడు వారాల్లోనే ఆస్పత్రి చేరికలు 150శాతం పెరిగినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.

కారణాలు ఇవేనా..?

వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తొలి రోజుల్లో తీసుకున్న వారిలో.. వాటివల్ల వచ్చిన యాంటీబాడీలు కనుమరుగైపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వైరస్‌ వ్యాప్తి పెరగడానికి డెల్టా వేరియంట్‌ కూడా మరో కారణంగా భావిస్తున్నారు. వీటికితోడు జులై 4న దేశవ్యాప్తంగా ఘనంగా జరిగిన అమెరికా స్వాతంత్ర్య వేడుకలు కూడా కేసుల సంఖ్య పెరగడానికి కారణమని అనుమానిస్తున్నారు. దీంతో బ్రిటన్‌లో మాదిరిగానే ఇక్కడ కూడా మరోసారి వైరస్‌ విజృంభణ కొనసాగుతుందనే ఆందోళన అక్కడి ప్రజల్లో మొదలయ్యింది. ముఖ్యంగా డెల్టా వేరియంట్‌ యువకులపై ప్రభావం చూపించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన పలు రాష్ట్రాలు, మరోసారి కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నాయి. అంతకుముందు కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో మాస్కు అవసరం లేదని ప్రకటించిన రాష్ట్రాలు, తాజాగా మాస్కులు తప్పనిసరి చేస్తూ ఆదేశిస్తున్నాయి. ప్రజలు సమూహాలుగా ఏర్పడడాన్ని తగ్గించుకోవాలని పేర్కొంటున్నాయి.

ఇదిలాఉంటే, ప్రపంచంలో కరోనా వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో అమెరికా తొలిస్థానంలో ఉంది. ఇప్పటివరకు అక్కడ 3కోట్ల 39లక్షల మందిలో వైరస్ బయటపడగా.. వీరిలో 6లక్షల 8వేల మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని