Ukraine Crisis: ఐరాసలో భారత్‌ ఓటింగ్‌కు దూరం.. స్వదేశంలో విమర్శలపై అమెరికా వ్యాఖ్యలు..!

ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ఐరాస సర్వప్రతినిధి సభ బుధవారం ప్రవేశపెట్టిన తీర్మానంపై భారత్‌ మూడోసారి ఓటింగ్‌కు దూరంగా ఉంది.

Updated : 03 Mar 2022 12:27 IST

భారత్‌ ఇప్పుడు ఆ రెండు విషయాల గురించే ఆలోచిస్తోందన్న అగ్రదేశం 

వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ఐరాస సర్వప్రతినిధి సభ బుధవారం ప్రవేశపెట్టిన తీర్మానంపై భారత్‌ మూడోసారి ఓటింగ్‌కు దూరంగా ఉంది. దీనిపై అగ్రదేశం అమెరికా స్పందించింది. రష్యా దురాక్రమణను ఖండించే విషయంలో సమిష్టిగా స్పందించాల్సిన అవసరం ఉందంటూ వ్యాఖ్యానించింది. ఆ అవసరాన్ని నొక్కిచెప్పేందుకు విదేశాంగ శాఖ భారత్‌తో సంప్రందింపులు జరుపుతోందని అమెరికా దౌత్యవేత్త డొనాల్డ్ లూ వెల్లడించారు. ఈ సంక్షోభంపై భారత్‌ స్పష్టమైన స్థానం తీసుకోవాలని కోరేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 

‘మా ఆలోచనలన్నీ ఎక్కువగా రష్యా దురాక్రమణ గురించే ఉన్నాయి. రష్యా దాడిని ఖండిస్తూ సమష్టిగా స్పందించాల్సిన ఆవశ్యకతను భారత్‌కు వివరించేందుకు మా ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతూనే ఉంది. మరోపక్క ఈ సమయంలో భారత ప్రభుత్వం రెండు విషయాల గురించి ప్రధానంగా దృష్టిసారించింది. ఒకటి.. ఈ సంక్షోభాన్ని ఇరుదేశాలు దౌత్యపరంగా పరిష్కరించుకోవాలని కోరుతోంది. అలాగే ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన వేల సంఖ్యలో ఉన్న విద్యార్థుల గురించి ఆందోళన చెందుతోంది. వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఉక్రెయిన్‌, రష్యా ప్రభుత్వాలను సంప్రదిస్తోంది’ అని డొనాల్డ్ అన్నారు.  

భారత్‌ విలువైన భాగస్వామి..

యూఎన్‌లో భారత్‌ ఓటింగ్‌కు దూరంగా ఉండటంతో అమెరికా నేతల నుంచి విమర్శలు వస్తున్నాయి. దాంతో యూఎస్‌ విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ ముందు డొనాల్డ్ వివరణ ఇచ్చారు. రెండు దేశాల మధ్య సంబంధాల గురించి వెల్లడించారు. అంతేగాకుండా రష్యా నుంచి భారత్‌ కొనుగోలు చేసిన ఎస్‌-400 ట్రయంఫ్ క్షిపణి రక్షణ వ్యవస్థ గురించి ప్రస్తావించారు. ఆ కొనుగోలుపై ఆంక్షల విషయమై బైడెన్ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ‘నేను చెప్పదల్చుకుందేంటంటే.. భారత్‌ ఇప్పుడు మనకు ముఖ్యమైన భద్రతా భాగస్వామి. ఆ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం మనకు విలువైందని భావిస్తున్నాం’ ఆయన కమిటీ ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అలాగే గత కొద్దికాలంగా రష్యా నుంచి భారత్‌ ఆయుధాల దిగుమతులను 53 శాతం తగ్గించిందని, అమెరికా, ఇతర భాగస్వామ్య దేశాల నుంచి రక్షణ కొనుగోళ్లను పెంచిందని గుర్తు చేశారు. అలాగే దేశీయంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటోందని వెల్లడించారు.

భారత్‌ దాడిని ఖండించనప్పటికీ.. 

ఇంకోపక్క ఆ దాడి విషయంలో భారత్ స్పష్టమైన వైఖరిని ప్రదర్శించనప్పటికీ.. కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయన్నారు. ఈ క్లిష్ట సమయంలో ఆ దేశం ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తోందన్నారు. మానవీయ సాయం పంపుతామని ప్రకటించిందని చెప్పారు. ఉక్రెయిన్ ప్రభుత్వ అభ్యర్థనకు తగినట్లుగా ఇప్పుడు అదే ముఖ్యమని తెలిపారు. ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని గౌరవించేందుకు అన్ని దేశాలు ఐరాస చట్టాలకు కట్టుబడి ఉండాలని భారత్ పిలుపునిచ్చింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఉక్రెయిన్ సార్వభౌమాధికారాన్ని రష్యా ఉల్లంఘిస్తుండటం పై ఇది భారత్‌ చేసిన స్పష్టమైన సూచన అని డొనాల్డ్ కమిటీ ముందు తెలియజేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు