America: షరతుల్లేకుండా చర్చలకు సిద్ధం.. ఉ.కొరియాకు అమెరికా పిలుపు

ఉత్తర కొరియా ఇటీవల జరిపిన జలంతర్గామి బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు ఆందోళనకరమని, ఇటువంటి చర్యలు కొరియా ద్వీపకల్పంలో శాంతి స్థాపనకు ఇది విఘాతంగా మారుతున్నాయని ఆ దేశంలో అమెరికా ప్రత్యేక ప్రతినిధి సంగ్‌ కిమ్‌ పేర్కొన్నారు. ఈ తరహా రెచ్చగొట్టే కార్యకలాపాలను...

Updated : 25 Oct 2021 11:08 IST

సియోల్: ఉత్తర కొరియా ఇటీవల జరిపిన జలంతర్గామి బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు ఆందోళనకరమని, ఇటువంటి చర్యలు కొరియా ద్వీపకల్పంలో శాంతి స్థాపనకు ఇది విఘాతంగా మారుతున్నాయని ఆ దేశంలో అమెరికా ప్రత్యేక ప్రతినిధి సంగ్‌ కిమ్‌ పేర్కొన్నారు. ఈ తరహా రెచ్చగొట్టే కార్యకలాపాలను నిలిపేయాలని, బదులుగా చర్చల్లో పాల్గొనాలని ఉ.కొరియాకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన సియోల్‌లో దక్షిణ కొరియా ప్రతినిధులతో సమావేశమైన అనంతరం మాట్లాడారు. ఉ.కొరియా పట్ల తమకు ఎలాంటి శత్రుభావం లేదని.. ముందస్తు షరతులు లేకుండా చర్చలకు సైతం సిద్ధమని తెలిపారు. కొరియా ద్వీపకల్పాన్ని అణ్వాయుధ రహితంగా మార్చడమే తమ లక్ష్యమని.. అందుకే ఉ.కొరియా ఇటీవలి వరుస పరీక్షలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.

‘యుద్ధస్థితి ముగింపు ప్రకటన కోసమే’

ఇటీవలి బాలిస్టిక్‌ ప్రయోగం ఐరాస భద్రతా మండలి తీర్మానాలనూ ఉల్లంఘించిందని సంగ్‌ కిమ్‌ ఆరోపించారు. మరోవైపు ఉ.కొరియా అమెరికా ప్రతిపాదనలను తిరస్కరిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. అమెరికా, దక్షిణ కొరియాలు ఒకవైపు తమ సొంత సైనిక కార్యకలాపాలతో ఉద్రిక్తతలను పెంచుతూ.. మరోవైపు దౌత్య చర్చల గురించి మాట్లాడుతున్నాయని ఇటీవల ఆరోపించింది. తమ బాలిస్టిక్ క్షిపణి పరీక్ష స్వీయ రక్షణ కోసమేనని, దీనికి అమెరికా అతిగా స్పందిస్తోందని విమర్శించింది. చర్చల విషయంలో వాషింగ్టన్ చిత్తశుద్ధిని ప్రశ్నించింది. ఇదిలా ఉండగా.. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య అనధికారికంగా సాగుతున్న యుద్ధ స్థితికి అధికారికంగా ముగింపు పలికే విషయమై అమెరికా ప్రతినిధితో చర్చించినట్లు దక్షిణ కొరియా ప్రతినిధి నోహ్ క్యూ డుక్ వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని