Indian Navy: అమ్ములపొదిలో సీహాక్‌ హెలికాప్టర్లు

భారత నావికా దళం అమ్ములపొదిలో  రెండు అత్యాధునిక హెలికాప్టర్లు చేరాయి. అమెరికా నేవీ నుంచి రెండు ఎమ్‌హెచ్‌-60ఆర్‌ సీహాక్‌ హెలికాప్టర్లను భారత్‌ కొనుగోలు చేసింది.

Updated : 17 Jul 2021 17:44 IST

దిల్లీ:  భారత నావికా దళం అమ్ములపొదిలో  రెండు అత్యాధునిక హెలికాప్టర్లు చేరాయి. అమెరికా నేవీ నుంచి రెండు ఎమ్‌హెచ్‌-60ఆర్‌ సీహాక్‌ హెలికాప్టర్లను భారత్‌ కొనుగోలు చేసింది. వాటిని శాన్‌ డియాగోలోని నావికాదళ వైమానిక కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమెరికా నేవీ నుంచి భారత నేవీ అందుకుంది. నావికాదళం తరఫున వాటిని అక్కడి భారత రాయబారి తరణ్‌జిత్‌ సింగ్‌ సంధు స్వీకరించారు. ఈ మేరకు నేవీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ హెలికాప్టర్ల చేరికతో భారత నావికాదళ పోరాట సామర్థ్యం మరింత పెరిగిందని తెలిపారు. వీటిని నడిపేందుకు నావికా దళ సిబ్బందికి చెందిన తొలి బృందం ప్రస్తుతం అమెరికాలో శిక్షణ పొందుతున్నట్లు వివరించారు.

ఎమ్‌హెచ్‌-60ఆర్‌ హెలికాప్టర్లను  అమెరికాకు చెందిన లాక్‌హీద్‌ మార్టిన్‌ కార్పొరేషన్‌ తయారు చేసింది. ఎలాంటి వాతావరణంలోనైనా  సమర్థంగా విధులు నిర్వర్తించగలగడం వీటి ప్రత్యేకత. పలు ప్రత్యేక విధులు నిర్వర్తించేందుకు వీలుగా ఆర్ట్‌ ఏవియానిక్స్‌, సెన్సార్ల తో వీటిని అభివృద్ధి చేశారు. ఈ శ్రేణిలో మొత్తం 24 హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు అమెరికాతో భారత్‌ ఒప్పందం కదుర్చుకుంది. భారత నావికాదళ వినియోగానికి, ఆయుధ ప్రయోగాలకు అనుగుణంగా  ఈ హెలికాప్టర్లలో మార్పులు  చేస్తారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని