America- China: ‘కృత్రిమ మేధ’ పోరులో అమెరికాపై చైనాదే పైచేయి

వాణిజ్యం, ఆర్థికం, సాంకేతికత.. ఇలా ఆయా రంగాల్లో అమెరికా, చైనాలు ఢీ అంటే ఢీగా మారిన విషయం తెలిసిందే. అయితే.. కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) పోరులో మాత్రం అగ్రరాజ్యంపై చైనా పైచేయి సాధించినట్లు పెంటగాన్ మాజీ చీఫ్ సాఫ్ట్‌వేర్ ఆఫీసర్‌ నికోలస్...

Updated : 12 Oct 2021 15:52 IST

భవిష్యత్తులో డ్రాగన్‌తో అగ్రరాజ్యం పోటీ పడలేదు: పెంటగాన్ మాజీ చీఫ్ సాఫ్ట్‌వేర్ ఆఫీసర్‌ నికోలస్‌ చైలాన్‌

వాషింగ్టన్‌: వాణిజ్యం, ఆర్థికం, సాంకేతికత.. ఇలా ఆయా రంగాల్లో అమెరికా, చైనాలు ఢీ అంటే ఢీగా మారిన విషయం తెలిసిందే. అయితే.. కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) పోరులో మాత్రం అగ్రరాజ్యంపై చైనా పైచేయి సాధించినట్లు పెంటగాన్ మాజీ చీఫ్ సాఫ్ట్‌వేర్ ఆఫీసర్‌ నికోలస్‌ చైలాన్‌ తాజాగా ఓ వార్త సంస్థకు వెల్లడించడం చర్చనీయాంశమైంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా.. వేగవంతమైన సాంకేతిక పురోగతితో ప్రపంచ ఆధిపత్యం వైపు దూసుకెళ్తోందన్నారు. రానున్న దశాబ్దంలోపే కృత్రిమ మేధస్సు, సింథటిక్‌ బయాలజీ, జన్యుశాస్త్రం తదితర అనేక కీలక శాస్త్రసాంకేతిక రంగాల్లో ‘డ్రాగన్‌’ అగ్రగామిగా నిలిచే అవకాశం ఉందన్న విదేశీ నిఘా సంస్థల అంచనాలను గుర్తుచేశారు.

‘గూగుల్‌ వంటి సంస్థలు సహకరించడం లేదు..’

ప్రపంచ భవిష్యత్తుపై ఆధిపత్యం చెలాయించేందుకు చైనా సిద్ధంగా ఉందని.. మీడియా కథనాల నుంచి భౌగోళిక రాజకీయాల వరకు అన్నింటినీ ఆ దేశం నియంత్రిస్తోందని నికోలస్‌ వ్యాఖ్యానించారు. రానున్న 15- 20 ఏళ్లలో అమెరికా.. చైనాతో పోటీపడే అవకాశం లేదని పేర్కొన్నారు. అగ్రరాజ్యంలో నిదానంగా సాగుతున్న ఆవిష్కరణలు, గూగుల్ వంటి అమెరికా సంస్థలు ‘ఏఐ’ విషయంలోనూ స్థానిక ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఇష్టపడకపోవడం, సాంకేతికత నైతిక విలువలపై చర్చలను ఆయన విమర్శించారు. ఇక్కడి కొన్ని ప్రభుత్వ విభాగాల సైబర్ రక్షణ వ్యవస్థలు ఇంకా బాల్య దశలోనే ఉన్నాయని ఎద్దేవా చేశారు. కానీ, చైనా కంపెనీలు మాత్రం తమ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నాయని, నైతికతతో సంబంధం లేకుండా కృత్రిమ మేధలో భారీగా పెట్టుబడులు పెడ్తున్నాయని వివరించారు.

ఎవరీ చైలాన్..?

నికోలస్‌ చైలాన్‌.. పెంటగాన్‌ మొదటి చీఫ్ సాఫ్ట్‌వేర్ ఆఫీసర్‌ పనిచేశారు. కానీ.. అమెరికా మిలిటరీలో టెక్నాలజీ మార్పు ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటానికి నిరసనగా సెప్టెంబరులో రాజీనామా చేశారు. అనుభవం లేని సైబర్ కార్యక్రమాలకు తమకు పదేపదే బాధ్యతలు అప్పగించారని ఆయన ఆరోపించారు. సాంకేతికత అభివృద్ధి విషయంలో అమెరికా స్పందించకపోతే.. దేశమే ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. మరోవైపు ఈ వ్యవహారంపై అమెరికా ఎయిర్ ఫోర్స్ సెక్రెటరీ ఫ్రాంక్ కెండల్.. చైలాన్‌తో మాట్లాడారు. సాఫ్ట్‌వేర్ అభివృద్ధికి ఆయన చేసిన సిఫార్సులపై చర్చించినట్లు కెండల్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని