Taiwan: ఎక్కడా తగ్గని తైవాన్‌.. అప్‌గ్రేడెడ్‌ ఎఫ్‌-16 యుద్ధ విమానాల దళం ప్రారంభం

చైనా- తైవాన్‌ నడుమ ఉద్రికత్తలు కొన్నాళ్లుగా తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. తైవాన్‌ను తమ భూభాగంలో కలిపి తీరతామని డ్రాగన్‌ ప్రకటిస్తూ వస్తోంది! ఈ క్రమంలో యుద్ధ పరిస్థితులే ఏర్పడితే.. చైనాను దీటుగా ఎదుర్కొనేందుకు తైవాన్‌ తన సైన్య సంపత్తిని మెరుగుపర్చుకుంటోంది...

Published : 18 Nov 2021 21:36 IST

తైపీ: చైనా- తైవాన్‌ నడుమ ఉద్రికత్తలు కొన్నాళ్లుగా తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. తైవాన్‌ను తమ దేశంలో కలిపి తీరతామని డ్రాగన్‌ ప్రకటిస్తూ వస్తోంది! ఈ క్రమంలో యుద్ధ పరిస్థితులే ఏర్పడితే.. చైనాను దీటుగా ఎదుర్కొనేందుకు తైవాన్‌ తన సైన్య సంపత్తిని మెరుగుపర్చుకుంటోంది! తాజాగా అమెరికా సాయంతో అప్‌గ్రేడ్‌ చేసిన అధునాతన ఎఫ్‌-16 యుద్ధ విమానాల మొదటి వింగ్‌ను తన వైమానిక దళంలోకి ప్రవేశపెట్టింది. తైవాన్ అధ్యక్షురాలు సయ్‌ ఇంగ్ వెన్ గురువారం ఇక్కడి చియాయిలోని వైమానిక స్థావరంలో అత్యంత అధునాతన ఎఫ్‌-16ఎస్‌, ఎఫ్‌-16వీ ఫైటర్‌ జెట్‌ల మొదటి స్క్వాడ్రన్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. వాషింగ్టన్‌తో సైనిక సహకారాన్ని ఈ సందర్భంగా ప్రశంసించారు. ‘మేం ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ విలువలకు కట్టుబడి ఉన్నంతకాలం.. ఇదే రకమైన ఆలోచనలు కలిగిన దేశాలు మాతో కలిసి ఉంటాయని విశ్వసిస్తున్నాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అమెరికా దౌత్యవేత్త సాండ్రా ఔడ్కిర్క్‌ సైతం పాల్గొన్నారు.

చైనా సైన్యానికి దీటుగా చర్యలు..

తైవాన్ తన 141 ఎఫ్‌-16ఏ/బీ ఫైటర్‌ జెట్‌లను అమెరికా సాయంతో ఎఫ్‌-16వీ వేరియంట్‌లోకి అప్‌గ్రేడ్‌ చేస్తోంది. అగ్రదేశానికి చెందిన లాక్‌హీడ్ మార్టిన్ కార్పొరేషన్‌, తైవాన్ ఏరోస్పేస్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌(ఏఐడీసీ) సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 64 యుద్ధవిమానాలను అప్‌గ్రేడ్ చేశారు. దీంతోపాటు తైవాన్‌ అదనంగా 66 కొత్త ఎఫ్‌-16వీల కొనుగోలుకు ఆర్డర్ చేసింది. అధునాతన ఏవియానిక్స్, రాడార్ సిస్టమ్‌ వీటి సొంతం. చైనా వైమానిక దళం, ముఖ్యంగా జే-20 ఫైటర్లను దీటుగా ఎదుర్కొనేందుకే తైవాన్‌ ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. సైన్యంలో మరిన్ని ఎఫ్‌-16వీల ప్రవేశంతో.. దేశ రక్షణావ్యవస్థ మరింత బలంగా మారిందని సయ్ చెప్పారు. వాస్తవానికి, అమెరికాకు తైవాన్‌తో అధికారిక దౌత్య సంబంధాలు లేవు. కానీ.. ఆయుధాలు సరఫరా చేస్తుంది. దీంతోపాటు చైనా విషయంలో అంతర్జాతీయ వేదికపై తైవాన్‌కు మద్దతుగా నిలుస్తోన్న విషయం తెలిసిందే.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు