wheat exports: గోధుమల ఎగుమతిపై నిషేధం..సడలింపులిచ్చిన కేంద్రం

విదేశాలకు ఎగుమతి నిమిత్తం కస్టమ్ క్లియరెన్స్‌ కోసం ఎదురుచూస్తోన్న గోధుమల రవాణాకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

Published : 17 May 2022 23:22 IST

దిల్లీ: విదేశాలకు ఎగుమతి నిమిత్తం కస్టమ్ క్లియరెన్స్‌ కోసం ఎదురుచూస్తోన్న గోధుమల రవాణాకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దేశీయంగా పెరుగుతున్న ధరల నియంత్రణలో భాగంగా గోధుమల ఎగుమతిపై ప్రభుత్వం ఇటీవల నిషేధం విధించింది. ఈ క్రమంలో తాజా సడలింపులపై ప్రకటన వెలువడింది. 

మే 13 లోగా కస్టమ్‌ క్లియరెన్స్ కోసం అప్పగించి, సిస్టమ్స్‌లో రిజిస్టర్‌ అయిన గోధుమల లోడును ఎగుమతి చేసేందుకు అనుమతులు ఇస్తున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. అంతేగాకుండా ఈజిప్టు ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఆ దేశానికి ఎగుమతి చేసేందుకు అంగీకరించింది. దానికి సంబంధించి కాండ్లా పోర్టులో లోడింగ్‌ జరుగుతోందని తెలిపింది. ఎగుమతులపై నిషేధం ప్రకటనతో గోధుమలు తీసుకొచ్చిన లారీలు పోర్టుల బయట వరుసకట్టాయంటూ నివేదికలు వెలువడ్డాయి. వాటిని పరిశీలించిన కేంద్రం తాజా సడలింపులు ప్రకటించింది.

భారత్‌ ఆలోచించుకోవాలి: అమెరికా

ఇదిలా ఉంటే.. గోధుమల ఎగుమతిని నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని భారత ప్రభుత్వం పునరాలోచించుకోవాలని అమెరికా కోరుకుంటోంది. ‘భారత ప్రభుత్వ నిర్ణయం గురించి తెలిసింది. ఎగుమతులపై పరిమితులు విధించవద్దని మేం దేశాలను ప్రోత్సహిస్తున్నాం. ఎందుకంటే ఈ నిర్ణయాలు ఆహార కొరతను తీవ్రం చేస్తాయి. ఇతర దేశాల ఆందోళనను ఈ దేశాలు వింటాయని ఆశిస్తున్నాం. అలాగే వాటి నిర్ణయాలను పునరాలోచించుకుంటాయని భావిస్తున్నాం’ అంటూ అమెరికా స్పందించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని