Indian Navy: ఇండియన్‌ నేవీలో కీలక పరిణామం.. యుద్ధనౌకపై ల్యాండ్‌ అయిన ఎంహెచ్‌-60 హెలికాప్టర్‌

అమెరికా నుంచి కొనుగోలు చేసిన బహుళ ప్రయోజన హెలికాప్టర్‌ తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ కోల్‌కతాపై విజయవంతంగా ల్యాండ్‌ అయ్యింది.

Updated : 19 May 2023 23:41 IST

దిల్లీ: భారతీయ నౌకాదళం కీలక మైలు రాయిని దాటింది. బహుళప్రయోజనకర హెలికాప్టర్‌ ఎంహెచ్‌-60.. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌-కోల్‌కతాపై తొలిసారి విజయవంతంగా ల్యాండ్‌ అయ్యింది. ఈ పరిణామం ఇండియన్‌ నేవీ యాంటీసబ్‌మెరైన్‌ యుద్ధ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని నేవీ అధికార వర్గాలు వెల్లడించాయి.

అమెరికా తయారు చేసిన ఈ ఎంహెచ్‌-60ఆర్‌ హెలికాప్టర్‌ జలాంతర్గాములపై దాడి చేయడంతోపాటు, నిఘా, యాంటీ షిప్పింగ్, పరిశోధన, రెస్క్యూ ఆపరేషన్లలో కీలకంగా వ్యవహరించే సామర్థ్యమున్నట్లు నౌకాదళం తెలిపింది. భారత నౌకాదళంలోకి ఈ హెలికాప్టర్‌ను ప్రవేశపెట్టడం ద్వారా రక్షణ రంగంలో భారత్‌ మరింత శక్తివంతంగా తయారవుతుందని పేర్కొంది. నీటి అంతర్భాగం ద్వారా పొంచి ఉన్న ప్రమాదాలను తిప్పికొట్టడంతోపాటు అత్యవసర సమయాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఈ హెలికాప్టర్‌ ఎంతగానో దోహదం చేస్తుందని నేవీ వెల్లడించింది. 

విదేశీ ఆయుధ ఉత్పత్తుల విక్రయాల ఒప్పందంలో భాగంగా అమెరికా ప్రభుత్వం నుంచి భారత రక్షణ శాఖ 24 ఎంహెచ్‌-60ఆర్‌ హెలికాప్టర్లను కొనుగోలు చేస్తోంది. వాటికి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన కొన్ని పరికరాలను అమర్చి తమకు అనువుగా మార్చుకుంటుంది. తొలి విడతగా 2021 జులైలో అమెరికా నుంచి 2 హెలికాప్టర్లు భారత్‌కు చేరుకోగా.. తాజాగా వాటిని ప్రయోగాత్మకంగా పరిశీలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని