Naxalites: నక్సల్స్‌ నుంచి అమెరికా ఆయుధం స్వాధీనం!

ఛత్తీస్‌గఢ్‌లో నవంబరు 26న జరిగిన ఎదురుకాల్పుల్లో నక్సలైట్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో అమెరికాలో తయారైన ఒక తుపాకి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Published : 04 Dec 2022 15:02 IST

రాయ్‌పూర్‌: ఇటీవల నక్సలైట్లతో ఎదురుకాల్పులు జరిగిన సమయంలో స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో కొన్ని అమెరికాలో తయారైనవి ఉన్నాయని ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు ఆదివారం వెల్లడించారు. బీజాపుర్‌ జిల్లాలో భద్రతా బలగాలు-మావోయిస్టు దళాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు డివిజనల్‌ కమిటీ సభ్యుడు మోహన్‌ కడ్తి(40), మట్వారా ఎల్‌వోఎస్‌ సభ్యుడు రమేష్‌(32), మహిళా మావోయిస్టు నేత సుమిత్ర(28), మరో మహిళా మవోయిస్టు మృతి చెందారు. 

ఘటనా స్థలం నుంచి మావోయిస్టు మృతదేహాలతో పాటు నాలుగు ఆయుధాలు, పేలుడు సామగ్రి, కిట్‌ బ్యాగులు, విప్లవ సాహిత్యం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఒకటి అమెరికాలో తయారైన ఎం1 కార్బైన్‌ తుపాకి ఉన్నట్లు పోలీసు అధికారి తెలిపారు. బ్యారెల్‌ చిన్నగా ఉండడంతో ఇతర అసాల్ట్‌ రైఫిళ్లతో పోలిస్తే దీన్ని నిర్వహణ చాలా సులభమని పేర్కొన్నారు. తుపాకిపై ఉన్న సీరియల్‌ నెంబర్‌ ఆధారంగా నక్సలైట్లు దీన్ని ఎక్కడి నుంచి సమకూర్చుకున్నారో తెలుసుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ తుపాకిని అమెరికా సైన్యం రెండో ప్రపంచ యుద్ధం, వియత్నాం యుద్ధం, కొరియన్‌ యుద్ధంలో ఉపయోగించింది.

ఇలా మావోయిస్టుల దగ్గర విదేశీ ఆయుధాలు దొరకడం ఇది కొత్తేమీ కాదు. 2011, 2014లో భానుప్రతాపూర్‌, రోఘట్‌ ‘మేడిన్‌ యూఎస్‌ఏ’ అని రాసి ఉన్న 7.65 ఎంఎం ఆటోమేటిక్‌ పిస్టల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే సుక్మా జిల్లాలో 2018లో జరిగిన ఎదురుకాల్పుల సమయంలో ‘మేడిన్‌ జర్మనీ’ తుపాకీ లభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని