US: రాహుల్‌ గాంధీ ‘పాక్‌, చైనా’ వ్యాఖ్యలపై అమెరికా ఏమన్నదంటే..?

భారత విదేశాంగ విధానంపై కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఆ వ్యాఖ్యలను తాము సమర్థించలేమంటూ

Updated : 03 Feb 2022 11:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత విదేశాంగ విధానంపై కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఆ వ్యాఖ్యలను తాము సమర్థించలేమంటూ ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ తెలిపారు.

పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘చైనా, పాకిస్థాన్‌  చేతులు కలపకుండా వేర్వేరు ఉంచాలన్నది భారత్‌ ఏకైక అతిపెద్ద వ్యూహం. అయితే, మీరు(మోదీని ఉద్దేశిస్తూ) ఆ రెండు దేశాలూ కలిసేలా చేశారు. ఇదే మీరు చేసిన అతిపెద్ద నేరం’’ అంటూ రాహుల్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అయితే రాహుల్‌ వ్యాఖ్యలపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ను మీడియా ప్రశ్నించగా.. ‘‘పాకిస్థాన్‌, పీఆర్‌సీ (పీపుల్స్‌ రిపబ్లిక్ ఆఫ్‌ చైనా) మధ్య బంధం గురించి ఆ రెండు దేశాలకే వదిలేస్తున్నా. అయితే ఆ వ్యాఖ్యలను (రాహుల్‌ను ఉద్దేశిస్తూ) మేం కచ్చితంగా సమర్థించలేం’’ అని సమాధానమిచ్చారు. అంతేగాక, పాకిస్థాన్‌ తమకు వ్యూహాత్మక భాగస్వామి అని, ఇస్లామాబాద్‌తో తమకు కీలకమైన బంధం ఉందని నెడ్‌ ప్రైస్‌ చెప్పడం గమనార్హం.

పార్లమెంట్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై రాహుల్‌ నిన్న తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘‘గణతంత్ర దినోత్సవాలకు ఒక్క విదేశీ అతిథినీ ఎందుకు తీసుకురాలేకపోయారో ఆత్మపరిశీలన చేసుకోండి. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్‌ నేడు ఒంటరిగా మిగిలిపోయింది. బాహ్యశక్తుల నుంచి దేశానికి తీవ్ర ముప్పు పొంచి ఉంది’’ అని అన్నారు. అయితే రాహుల్‌ వ్యాఖ్యలపై భాజపా నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని