US: పేద దేశాలకు 50కోట్ల ఫైజర్‌ టీకాలు

కొవిడ్‌ మహమ్మారిపై పోరులో పేద, మధ్యతరగతి దేశాలకు అండగా ఉండేందుకు అగ్రరాజ్యం అమెరికా ముందుకొచ్చింది. 50 కోట్ల ఫైజర్‌ టీకాలను కొనుగోలు చేసి వాటిని తక్కువ,

Published : 11 Jun 2021 01:49 IST

వాషింగ్టన్‌: కొవిడ్‌ మహమ్మారిపై పోరులో పేద, మధ్యతరగతి దేశాలకు అండగా ఉండేందుకు అగ్రరాజ్యం అమెరికా ముందుకొచ్చింది. 50 కోట్ల ఫైజర్‌ టీకాలను కొనుగోలు చేసి వాటిని తక్కువ, మధ్యస్థాయి ఆదాయం ఉన్న దేశాలు, ఆఫ్రికా యూనియన్‌కు వితరణగా ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ వెల్లడించింది. దీనికి అధ్యక్షుడు జో బైడెన్‌ నేడు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. 

యూకేలో జరిగే జి-7 దేశాల సదస్సులో పాల్గొనేందుకు బైడెన్‌ ఇప్పటికే లండన్‌కు చేరుకున్నారు. ఈ సదస్సులోనే టీకాల విరాళంపై ఆయన కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాక్సిన్ల ఎగుమతి ఆగస్టు నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరి నాటికి 20 కోట్ల డోసులు, 2020 తొలి అర్ధభాగం నాటికి మరో 30 కోట్ల డోసులను అందించాలని అమెరికా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తక్కువ, మధ్య ఆదాయం కలిగిన దేశాలకు కొవాక్స్‌ ద్వారా ఈ టీకాలను పంపిణీ చేయనున్నట్లు వైట్‌హౌస్‌ వెల్లడించింది. ప్రపంచ ప్రజల రక్షణ కోసం అమెరికన్లు కట్టుబడి ఉన్నారని శ్వేతసౌధం పేర్కొంది. 

ఇప్పటికే తమ దేశంలో ఉన్న టీకా మిగులు నిల్వల నుంచి 8 కోట్ల డోసులను ప్రపంచ దేశాలకు అందిస్తామని అమెరికా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. జూన్‌ చివరి నాటికి ఆ వ్యాక్సిన్ల పంపిణీని పూర్తి చేస్తామని తెలిపింది. ఇందులో కొన్ని టీకా డోసులు భారత్‌కు కూడా రానున్నాయి. ఇక దీంతో పాటు టీకా పంపిణీ, కరోనా నివారణ కోసం కొవాక్స్‌కు 2 బిలియన్‌ డాలర్ల సహకారం అందిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని