
భారత్‌కు యూఎస్ 100మి.డాలర్ల వైద్య సామగ్రి
వాషింగ్టన్: కరోనాపై పోరులో భారత్‌కు మద్దతు కొనసాగిస్తామని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. భారత్‌కు వంద మిలియన్ డాలర్ల విలువైన వైద్య సామగ్రిని సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు శ్వేతసౌధం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా వైద్య సామగ్రి సరఫరా చేసేందుకు కొనసాగుతున్న ప్రయత్నాల్ని అమెరికా రక్షణ మంత్రి ఆస్టిన్ బుధవారం ట్విటర్ ద్వారా పంచుకున్నారు.
‘ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌కు సాయం చేసేందుకు అమెరికా కట్టుబడి ఉంది. భారత్‌లో ఆరోగ్య కార్యకర్తలకు శక్తిమేరకు సాయం చేస్తాం. కొవిడ్‌కు సంబంధించిన అత్యవసర పరికరాలు గురువారం భారత్‌కు బయలుదేరనున్నాయి. వాటిలో వెయ్యి ఆక్సిజన్ సిలిండర్లు, 15 మిలియన్ల ఎన్-95 మాస్కులు, 1 మిలియన్ ర్యాపిడ్ కిట్లు పంపనున్నాం. అంతేకాకుండా ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తయారీ సామగ్రిని భారత్‌కు పంపుతున్నాం. అది 20 మిలియన్ డోసులు తయారీకి ఉపయోగపడుతుంది. కరోనాపై పోరులో భాగంగా ఇప్పటికే యూఎస్ ఎయిడ్ కింద 23 మిలియన్ డాలర్ల సాయం అందిస్తున్నాం. అంతేకాకుండా యూఎస్ ఎయిడ్ తరపున త్వరలో వెయ్యి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేస్తాం’ అని శ్వేతసౌధం వెల్లడించింది.
మరోవైపు, రష్యా నుంచి వైద్య పరికరాలు, ఇతర సామగ్రి భారత్ చేరుకునర్నాయి. రెండు విమానాల్లో సుమారు 20 టన్నుల వస్తువులను రష్యా పంపించింది. కరోనా వ్యాప్తి నివారణ, వైద్య సదుపాయాల కల్పనకు రష్యా సహకారం అందిస్తోంది.