China: అవి అంతర్జాతీయ జలాలు.. చైనా సొంతం కాదు..!

దక్షిణ చైనా సముద్ర జలాలపై అమెరికా-చైనా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా అమెరికా విదేశాంగశాఖా మంత్రి

Published : 14 Dec 2021 17:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణ చైనా సముద్ర జలాలపై అమెరికా-చైనా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకన్‌ స్పందించారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దూకుడు చర్యలను ఆపాలని కోరారు. ప్రస్తుతం ఆయన దక్షిణాసియా దేశాల పర్యటనలో భాగంగా ఇండోనేషియాకు చేరుకొన్నారు. ప్రస్తుతం జోబైడెన్‌ కార్యవర్గం ఆసియా దేశాలతో సంబంధాలను పునరుద్ధరించుకొనేందుకు తీవ్ర యత్నాలు చేస్తోంది. ట్రంప్‌ పాలనలో ఈ దేశాలతో అమెరికా సంబంధాలు మసకబారాయి.

ఇండోనేషియా పర్యటనలో భాగంగా బ్లింకన్‌ అమెరికా వైఖరిని వెల్లడించారు. అంతర్జాతీయ నిబంధనల అమలు కొనసాగించేందుకు అమెరికా తన సహచరులు, భాగస్వాములతో కలిసి పనిచేస్తుందని తెలిపారు. ఈ క్రమంలో ఆయా దేశాలు తాము ఏ పక్షంలో ఉంటాయో నిర్ణయించుకోవచ్చని అన్నారు. ‘‘అంతర్జాతీయ జలాలను సొంత సముద్రాలుగా ప్రకటించుకోవడం.. ప్రభుత్వ రాయితీలతో అంతర్జాతీయ మార్కెట్లను తనకు అనుకూలంగా మార్చుకోవడం,  తన పాలసీలను అంగీకరించని వారికి ఎగుమతులు నిలిపివేయడం, ఒప్పందాలను రద్దు చేయడం వంటి చైనా దూకుడు వైఖరి మారాలని ఆసియా దేశాలు కోరుకొంటున్నాయి. మేము కూడా అదే కోరుకొంటున్నాం. బీజింగ్‌ చర్యలు 3 ట్రిలియన్‌ డాలర్ల వ్యాపారం జరిగే మార్గాలకు ముప్పుగా మారింది’’ అని పేర్కొన్నారు. ఇండోపసిఫిక్‌ ప్రాంతంలో ఘర్షణను అమెరికా కోరుకోవడంలేదని తెలిపారు. అదే సమయంలో తైవాన్‌ జలసంధిలో అమెరికా శాంతిని కోరుకుంటోందన్నారు.

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని