Afghan Crisis: తాలిబన్లతో డీల్‌ ట్రంప్‌ది.. ఫినిషింగ్‌ బైడెన్‌ది!

అఫ్గానిస్థాన్‌ తాలిబన్ల హస్తగతం కావడంతో అక్కడ తీవ్ర కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. రెండు దశాబ్దాల కిందట అరాచక పాలనే మళ్లీ మగ్గిపోవాల్సి వస్తుందని అక్కడి జనం ప్రాణభయంతో.......

Updated : 17 Aug 2021 21:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అఫ్గానిస్థాన్‌ తాలిబన్ల హస్తగతం కావడంతో అక్కడ తీవ్ర కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. రెండు దశాబ్దాల కిందట ఉన్న అరాచక పాలనలో మళ్లీ మగ్గిపోవాల్సి వస్తుందని అక్కడి జనం ప్రాణభయంతో భీతిల్లిపోతున్నారు. బతుకు జీవుడా.. అంటూ తమ దేశం వదిలి పారిపోతున్న దృశ్యాలు ప్రపంచ దేశాలను కలిచివేస్తున్నాయి. అమెరికా బలగాలను ఉపసంహరించుకోవడం వల్లే తాలిబన్ ఫైటర్లు మెరుపు దాడులతో కాబుల్‌ను వశపరచుకోవడంతో ఇలాంటి భీతావహ వాతావరణం నెలకొందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. తాలిబన్లతో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఒప్పందం కుదుర్చుకోగా.. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ దాన్ని అమలుచేయడమే ఇందుకు కారణం. అయితే, 20 ఏళ్ల కాలంలో అమెరికా సైన్యం చేతిలో శిక్షణ పొందిన అఫ్గాన్‌ సైన్యం ఎందుకు తాలిబన్‌ ఫైటర్లను ఎదుర్కోలేకపోయింది? అగ్రరాజ్యం అండదండలు ఉన్నా అఫ్గన్‌ ప్రభుత్వం తాలిబన్‌ ఫైటర్ల ముందు ఎందుకు మోకరిల్లాల్సి వచ్చిందన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.

ఏమిటీ ఒప్పందం?
అఫ్గాన్‌లో సుస్థిర శాంతిని నెలకొల్పే ఉద్దేశంతో అమెరికా, తాలిబన్ల మధ్య గతేడాది ఫిబ్రవరిలో ఖతార్‌ రాజధాని దోహా వేదికగా చారిత్రక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. 135 రోజుల్లోపు అమెరికా మిత్ర దేశాలు తమ సేనల సంఖ్యను 8600లకు తగ్గించుకోవాలి. అలాగే,  14 నెలల్లోపు మొత్తం బలగాలను ఉపసంహరించుకొనేలా ఒప్పందం కుదిరింది. వేలాది మంది ఖైదీల అప్పగింతకు కూడా ఇరు దేశాలూ పరస్పరం అంగీకరించడంతో పాటు ఇరు ప్రతినిధులూ సంతకాలు చేశారు. అప్పడు అమెరికా విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న మైక్‌ పాంపియో పర్యవేక్షణలో తాలిబన్లతో ఈ ఒప్పందం కుదిరింది. అంతేకాకుండా అల్‌ఖైదాతో తాలిబన్లు పూర్తిగా సంబంధాలను తెంచుకోవాలని కూడా అమెరికా షరతు విధించింది. అయితే, ఈ ఒప్పందంలో అఫ్గన్‌ ప్రభుత్వాన్ని భాగస్వామిని చేయకుండా ఏకపక్షంగా సాగడం ఆందోళనకర పరిణామం. ఒప్పందంలో భాగంగా తాలిబన్ల స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేయబోమని హమీ ఇవ్వడంతో తాలిబన్లకు తిరిగి ఊపిరి వచ్చినట్టయింది. ఈ ఒప్పందం అమలవుతున్న తరుణంలో చోటుచేసుకున్న పరిణామాలు తాలిబన్లను మరింత బలోపేతం చేశాయి. వైమానిక దాడులు నిలిచిపోవడంతో అక్కడక్కడా చెల్లాచెదురుగా పడిఉన్న తాలిబన్‌ ఫైటర్లు, సానుభూతిపరుల పునరేకీకరణ జరిగింది. దీంతో పుంజుకొని అఫ్గాన్‌ ప్రజా ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేసిన తాలిబన్లు ఎవరి ఊహలకు అందనంతగా మెరుపు వేగంతో కాబుల్‌ను ఆక్రమించి తమ జెండా పాతేశారు. 

అఫ్గాన్‌ సైన్యం ఎందుకు మోకరిల్లింది? 

అమెరికా సాయంగా సమకూర్చిన ఆయుధాలు, నిధులతో రెండు దశాబ్దాలుగా అఫ్గాన్‌ సైన్యం ఎంతో రాటుతేలిందని భావించినా అదంతా వృథాగానే మిగిలిపోయింది. ఆ సైన్యం తాలిబన్‌ ఫైటర్లను దీటుగా ఎదుర్కోలేకపోయింది. కొందరు సైనికులు అవినీతికి అలవాటుపడిపోవడం, తాలిబన్‌లకు పావులుగా మారడంతో ఈ సంక్షోభ సమయంలో దీటుగా ఎదుర్కోలేక చతికిలపడిపోయారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అఫ్గాన్‌ అధ్యక్షుడిగా కొనసాగిన అష్రఫ్‌ ఘనీ కూడా తక్కువేం తినలేదు. ఆయన దేశంలోని ఉత్తర ప్రాంతంలో బలీయశక్తిగా ఉన్న నార్తర్న్‌ అలయన్స్‌ (ఉత్తర కూటమి)ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. దీంతో 2001లో అమెరికాకు సహకరించిన ఉత్తరకూటమి ప్రస్తుతం పోరాడే సత్తా లేక పూర్తిగా చతికిలపడింది. ఇరాక్‌లోనూ తొలినాళ్లలో ఇలాంటి పరిస్థితులే ఏర్పడినా ఆ దేశ సైన్యం తిరిగి పుంజుకోవడంతో ఐసిస్‌పై విజయం సాధించింది. అయితే అఫ్గాన్‌ సేనలో అంకితభావం, పోరాట పటిమ, దేశభక్తి లేకపోవడం.. తదితర కారణాలతో ఒక్క తూటా కాల్చకుండానే తాలిబాన్లకు లొంగిపోయింది.

విమర్శల్ని తిప్పికొట్టిన అమెరికా

మరోవైపు, అఫ్గాన్‌ విషయంలో బైడెన్‌ విఫలమయ్యారన్న  విమర్శల్ని అగ్రరాజ్యం తోసిపుచ్చింది. అఫ్గాన్‌ సేనల చేతకానితనమే తాలిబన్ల ఆధిపత్యానికి కారణమైందని అగ్రరాజ్యం జాతీయ భద్రత సలహాదారు జేక్‌ సూల్లివన్‌ పేర్కొన్నారు. అఫ్గాన్‌లో రెండు దశాబ్దాల పాటు కొనసాగిన యుద్ధాన్ని మూడో దశాబ్దంలోనూ చూడాలని బైడెన్‌ భావించలేదన్నారు. ఇన్నేళ్లుగా అఫ్గాన్‌ సేనలకు శిక్షణ, వందల కోట్ల డాలర్ల నిధులు అందించిన తర్వాత ప్రభుత్వ సైన్యమే తమ దేశాన్ని కాపాడుకోవాల్సి ఉంటుందని బైడెన్‌ భావించారన్నారు. అందుకే అమెరికా దళాల ఉపసంహరణ నిర్ణయానికి బైడెన్‌ కట్టుబడ్డారని చెప్పుకొచ్చారు. మరోవైపు, ఈ పరిస్థితికి బైడెనే కారణమని ట్రంప్‌ విమర్శలు గుప్పించారు. అమెరికా చరిత్రలోనే అత్యంత ఘోరమైన వైఫల్యమన్నారు. బైడెన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ట్రంప్‌ అధికారంలో ఉండి తాను విదేశాంగ మంత్రిగా ఉంటే తాలిబన్లకు అమెరికా గుణపాఠం నేర్పిఉండేదని పాంపియో వ్యాఖ్యానించడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని