Srinagar: డ్రోన్ల వినియోగంపై ఆంక్షలు..!

జమ్మూలోని వైమానిక స్థావరంపై ఇటీవల డ్రోన్‌ దాడులు జరిగిన నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకు అక్కడి ప్రభుత్వ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది.

Published : 04 Jul 2021 23:45 IST

శ్రీనగర్‌: జమ్మూలోని వైమానిక స్థావరంపై ఇటీవల డ్రోన్‌ దాడులు జరిగిన నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకు అక్కడి ప్రభుత్వ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రోన్ల వినియోగంపై ఆదివారం పలు ఆంక్షలు విధించింది. ఈ మేరకు శ్రీనగర్‌ పాలనా యంత్రాంగం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం ఇప్పటికే డ్రోన్ కెమెరాలను కలిగి ఉన్న యజమానులు వాటిని స్థానిక పోలీస్‌ ఠాణాల్లో అప్పగించాలని శ్రీనగర్‌ కలెక్టర్‌ మహమ్మద్‌ ఐజాజ్‌ ఆదేశించారు. భద్రతా చర్యల్లో భాగంగా కీలక స్థావరాలు, అధిక జనాభా ఉన్న ప్రాంతాలు సహా సామాజిక, సాంస్కృతిక సమావేశాల్లో డ్రోన్ల వాడకాన్ని నిలిపివేయడం అత్యవసరంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. భూ సర్వే, పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయ క్షేత్రాలకు సంబంధించి నిఘా, విపత్తు నిర్వహణ తదితర కార్యకలాపాల్లో  డ్రోన్లను వినియోగిస్తున్న ప్రభుత్వ శాఖలు సైతం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. 

సొంతంగా డ్రోన్లను కలిగి ఉండటం, అమ్మకాలు, వినియోగం, సరఫరాలపై అవసరం మేరకు జిల్లావ్యాప్తంగా ఆంక్షలు విధిస్తామని శ్రీనగర్‌ ఎస్పీ వెల్లడించారు. రక్షణ సంబంధిత స్థావరాలకు ముప్పు తలపెట్టేందుకు డ్రోన్లను దుర్వినియోగం చేస్తున్నట్లు ఇటీవల చోటుచేసుకున్న పలు ఘటనల ఆధారంగా రుజువైందన్నారు. ఈ నేపథ్యంలో గగనతలంపై ఎలాంటి డ్రోన్‌లు సంచరించకుండా నియంత్రణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. బరువు, గుర్తింపు సంఖ్య, ఎత్తు, వేగం ఆధారంగా డ్రోన్ల నియంత్రణపై పౌరవిమానయాన శాఖ డైరెక్టరేట్‌ జనరల్‌(డీజీసీఏ) ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని