Kerala: వర్షంలో గొడుగు పట్టుకున్నారా?.. ఫైన్‌ కట్టాల్సిందే..!

వర్షంలో గొడుగు పట్టుకుంటే ఫైన్‌ కట్టడమేంటి అనుకుంటున్నారు. అవును.. నిజమే. కేరళ ప్రభుత్వం ఓ కొత్త నిబంధనను తీసుకొచ్చింది.....

Published : 18 Oct 2021 23:11 IST

తిరువనంతపురం: వర్షంలో గొడుగు పట్టుకుంటే ఫైన్‌ కట్టడమేంటి అనుకుంటున్నారు. అవును.. నిజమే. కేరళ ప్రభుత్వం ఓ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. అయితే ట్రాఫిక్‌లో గొడుగు పట్టుకొని వెళ్లే ద్విచక్ర వాహనదారులకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. ట్రాఫిక్‌ ఉన్న సమయంలో ద్విచక్ర వాహనదారులు గొడుగు పట్టుకొని వెళ్లడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం తీసుకొచ్చిన నిబంధన వింతగా అనిపించినప్పటికీ.. ఈ నిబంధనతో వర్షాకాలంలో ప్రయాణికులు, పాదచారులు ప్రమాదాల బారిన పడకుండా ఉంటారు.

ప్రస్తుతం కేరళలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల ధాటికి పలు జిల్లాలు జలమయమయ్యాయి. కొండచరియలు విరిగిపడి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ వర్షాల నేపథ్యంలో అనేకమంది ద్విచక్ర వాహనదారులు గొడుగులు పట్టుకొనే ప్రయాణం చేస్తున్నారు. ఈ తరహా ప్రయాణాలు ప్రమాదాలకు దారితీస్తాయని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. గొడుగు పట్టుకొని వెళ్లేవారి కారణంగా.. వారితోపాటు సమీపం నుంచి వెళ్లేవారికి, పాదచారులకు ప్రమాదకరమని తెలిపింది. ఈ నేపథ్యంలోనే తాజా నిబంధనను అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. తాజా నిబంధనను కఠినంగా అమలు చేయాలంటూ ట్రాఫిక్‌ ఉన్నతాధికారులకు ఆ రాష్ట్ర రవాణా కమిషనర్‌ లేఖలు రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని