Uttar Pradesh: ఆరుగురు పోలీసులకు యూపీ అసెంబ్లీ శిక్ష!

ఓ ఎమ్మెల్యే ప్రత్యేక హక్కుల ఉల్లంఘన కేసులో ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ శుక్రవారం ఆరుగురు పోలీసులకు ఒక రోజు శిక్ష విధించింది. ఇది దాదాపు రెండు దశాబ్దాల క్రితం నాటి కేసు కావడం గమనార్హం.

Updated : 03 Mar 2023 23:59 IST

లఖ్‌నవూ: దాదాపు రెండు దశాబ్దాల క్రితం నాటి ఓ ఎమ్మెల్యే ప్రత్యేక హక్కుల ఉల్లంఘన(Breach of Privilege) కేసులో ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ (Uttar Pradesh Assembly) ఆరుగురు పోలీసులకు ఒక రోజు శిక్ష(Imprisonment) విధించింది. కాన్పూర్‌లో విద్యుత్ కోతలకు నిరసనగా 2004 సెప్టెంబరులో అప్పటి భాజపా ఎమ్మెల్యే సలీల్‌ విష్ణోయ్‌(Salil Vishnoi) ఆధ్వర్యంలోని ఓ బృందం కాన్పూర్‌నగర్‌ జిల్లా మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు సమర్పించేందుకు వెళ్తుండగా.. పోలీసు సిబ్బంది ఆయన పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో శాసనసభ తనకు కల్పించిన ప్రత్యేక హక్కులకు భంగం వాటిల్లినట్లు ఆరోపిస్తూ.. ఆయన ఈ వ్యవహారంపై అసెంబ్లీకి ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్యే ఫిర్యాదుపై విచారణ చేపట్టిన హౌస్ ప్రివిలేజ్ కమిటీ.. ఇటీవల సంబంధిత పోలీసులకు శిక్ష విధించాలంటూ సిఫార్సు చేసింది. అయితే, ఎంత మొత్తంలో శిక్ష విధించాలనేదాన్ని శాసనసభ శుక్రవారం నిర్ణయించింది. ఈ క్రమంలోనే అసెంబ్లీ వ్యవహారాల మంత్రి సురేష్ ఖన్నా.. ఆరుగురు పోలీసులకు ఒక రోజు నిర్బంధం విధించాలంటూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ మేరకు అర్ధరాత్రి 12 గంటల వరకు వారిని అసెంబ్లీలోనే నిర్బంధించాలని స్పీకర్ సతీష్ మహానా ఆదేశించారు. నాటి కాన్పూర్‌నగర్‌ బాబుపూర్వా ఇన్‌స్పెక్టర్‌ అబ్దుల్ సమద్(ప్రస్తుతం రిటైర్డ్‌), కిద్వాయ్ నగర్ ఎస్‌హెచ్‌వో శ్రీకాంత్ శుక్లా, ఎస్సై త్రిలోకి సింగ్, కానిస్టేబుళ్లు ఛోటే సింగ్, వినోద్ మిశ్రా, మెహర్బాన్ సింగ్‌లకు ఈ శిక్ష పడింది. శుక్రవారం అసెంబ్లీకి హాజరైన వారు.. నాటి ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే విధానసభ భవనంలోని ఓ గదికే పరిమితమయ్యారు. వారికి ఆహారం, ఇతర సౌకర్యాలు ఏర్పాట్లు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని