Kalyan Singh: యూపీ మాజీ సీఎం కల్యాణ్‌ సింగ్‌ కన్నుమూత

భాజపా సీనియర్‌ నేత, ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం కల్యాణ్‌ సింగ్‌ (89) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో.....

Updated : 21 Aug 2021 23:07 IST

లఖ్‌నవూ: భాజపా సీనియర్‌ నేత, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం కల్యాణ్‌ సింగ్‌ (89) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో లఖ్‌నవూలోని సంజయ్‌ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. తన 60 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక కీలక పదవులు అలంకరించారు. భాజపా మూల సిద్ధాంతం హిందుత్వను బలంగా వినిపించారు. 10 సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ముఖ్యమంత్రిగా, రెండుసార్లు ఎంపీగా, రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా సేవలందించారు. ఆయనకు కుమారుడు రాజ్‌వీర్‌ సింగ్‌, కుమార్తె ప్రభా వర్మ ఉన్నారు. రాజ్‌వీర్‌ సింగ్‌ ప్రస్తుతం ఏత్‌ నియోజకవర్గం నుంచి భాజపా ఎంపీగా కొనసాగుతున్నారు.

కల్యాణ్‌ సింగ్‌ రాజకీయ ప్రస్థానమిదీ..

కల్యాణ్ సింగ్ 1932, జనవరి 5న తేజ్‌పాల్‌ సింగ్‌ లోధి, సీతాదేవి దంపతులకు యూపీలోని అలీగఢ్‌ జిల్లా మధౌలీ గ్రామంలో జన్మించారు. 60 ఏళ్లకు పైగా సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన అరుదైన నేతగా కల్యాణ్ సింగ్‌ ఉత్తరప్రదేశ్, దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని నిలిచారు. ఆరెస్సెస్‌ నుంచి రాజస్థాన్‌ గవర్నర్‌ దాకా అంచెలంచెలుగా ఎదిగిన ఆయన రాజకీయ ప్రస్థానంలో మలుపులెన్నో. 1957లో ఆరెస్సెస్‌ ప్రచారక్‌గా మొదలై ఆ తర్వాత జన్‌సంఘ్‌లో చేరడం ద్వారా రాజకీయ జీవితానికి పునాది వేసుకున్నారు. 1967లో అత్రౌలి నియోజకవర్గం నుంచి భారతీయ జన్‌సంఘ్‌ తరఫున పోటీచేసి గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అప్పట్నుంచి వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగించిన కల్యాణ్‌ సింగ్‌కు 1980లో బ్రేక్‌ పడింది. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ (ఐ) నేత అన్వర్‌ఖాన్‌ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతోనే పరాజయం చవిచూశారు. ఆ తర్వాత 1985లో మళ్లీ అదే నియోజకవర్గం నుంచి భాజపా తరఫున బరిలో దిగి 1996 వరకు విజయ ప్రస్థానాన్ని కొనసాగించారు. 1967 నుంచి 2002 మధ్య కాలంలో అత్రౌలి నుంచి 10 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2002లో మాత్రం తాను స్థాపించిన రాష్ట్రీయ క్రాంతి పార్టీ తరఫున బరిలో నిలిచి గెలిచారు. ఈ క్రమంలోనే 1977-79లో యూపీ ఆరోగ్యమంత్రిగా, రెండు పర్యాయాలు సీఎంగా సేవలందించారు. 

అయోధ్య ఘటనతో సీఎం పదవికి రాజీనామా

ఇందిరా గాంధీ అమలుచేసిన ఎమర్జెన్సీ కాలంలో 21 నెలల పాటు జైలు జీవితం గడిపారు. 1991 జూన్‌లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయంతో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయోధ్యను దర్శించి రామమందిర నిర్మాణానికి ప్రతిన బూనారు. కల్యాణ్‌సింగ్‌ సీఎంగా ఉన్నప్పుడే బాబ్రీ మసీదు ఘటన చోటుచేసుకుంది. ఆ ఘటనతో సీఎం పదవిని కోల్పోవాల్సి వచ్చింది. దీంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. అనంతరం 1993 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో అత్రౌలి, కాస్‌గంజ్‌ అసెంబ్లీ స్థానాల నుంచి బరిలో దిగి రెండు చోట్లా విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో భాజపా ఓటమిపాలైంది. దీంతో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆ తర్వాత 1997లో జరిగిన ఎన్నికల్లో భాజపా గెలుపుతో మళ్లీ సీఎం అయ్యారు. 

భాజపాను వీడి.. వాజ్‌పేయీ కోరడంతో మళ్లీ సొంతగూటికి.. 

భాజపాతో విభేదాలు తలెత్తడంతో 1999లో కాషాయ దళాన్ని వీడి సొంతంగా రాష్ట్రీయ క్రాంతి పార్టీని స్థాపించారు. 2004లో మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ కోరడంతో మళ్లీ భాజపాలో చేరారు. తన పార్టీని కూడా విలీనం చేశారు. అదే సంవత్సరంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బులంద్‌షెహర్‌ నియోజకవర్గం నుంచి భాజపా టికెట్‌పై పోటీ చేసి గెలిచారు. 2009 జనవరి 20న భాజపాను మళ్లీ వీడి స్వతంత్ర అభ్యర్థిగా ఇటా లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగి తన సత్తా చాటారు. అనంతరం తన కుమారుడు రాజ్‌వీర్‌ సింగ్‌తో కలిసి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు.

అయితే, 2009 నవంబర్‌ 14న ఫిరోజాబాద్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీనికి కల్యాణ్‌ సింగే కారణమని, ఆయన వల్లే ముస్లింల ఓట్లు రాలేదని ములాయంసింగ్‌ యాదవ్‌ నిందించడంతో 2010లో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి జన్‌క్రాంతి పేరిట జనవరి 5, 2010న కొత్త పార్టీని స్థాపించారు. ఆ తర్వాత 2013 జవనరి 21న ఆ పార్టీని కూడా రద్దు చేశారు. 2013లో మరోసారి భాజపాలోనే చేరారు. సెప్టెంబర్‌ 4, 2014న ఆయన రాజస్థాన్‌ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసి 2019 సెప్టెంబర్‌ 8  వరకు కొనసాగారు. అదే కాలంలో 2015 జనవరి 28న హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించారు.

ప్రధాని మోదీ సంతాపం

కల్యాణ్‌ సింగ్‌ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం తెలియజేశారు. ఆయన దూరం కావడం మాటల్లో చెప్పలేనంత బాధగా ఉంది. కల్యాణ్‌ సింగ్‌ అట్టడుగు స్థాయి నుంచి గొప్ప నేతగా ఎదిగారు. రాజనీతిజ్ఞుడు, మానవతా విలువలున్న వ్యక్తి అని కొనియాడారు. ఉత్తరప్రదేశ్‌ అభివృద్ధిలో కల్యాణ్‌ సింగ్‌ పాత్ర ఎనలేనిదని ప్రశంసించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని