
కరోనా ఎఫెక్ట్.. యూపీలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు పొడిగింపు
లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కళాశాలలకు ఇచ్చిన సెలవులు నేటితో ముగియడంతో మళ్లీ వాటిని పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు జనవరి 23 వరకు సెలవులను పొడిగించిన ప్రభుత్వం.. ఆన్‌లైన్ తరగతులు కొనసాగుతాయని పేర్కొంది. కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవులను జనవరి 23 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. రాత్రిపూట కర్ఫ్యూని రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు కఠినంగా అమలు చేయాలని అధికారుల్ని ఆదేశించారు.
ఒమిక్రాన్ ప్రభావంతో కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో భౌతిక తరగతులను ఈ నెల 16 వరకు రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత వారం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ గడువు నేటితో ముగిసిపోవడంతో సెలవులను మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘‘లఖ్‌నవూలో ఈరోజు 2300 పాజిటివ్ కేసులు ఈరోజు నమోదు కావడంతో నగరంలో యాక్టివ్ కేసుల సంఖ్య 16,300కి పెరిగింది. 1శాతం కన్నా తక్కువ మంది రోగులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ బాగా జరుగుతున్నందున థర్డ్ వేవ్ ప్రభావం అంతగా ఉండదు’’ అని సీఎం అన్నారు. యూపీలో నిన్న ఒక్కరోజే దాదాపు 15,700లకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క లఖ్‌నవూలోనే 2,769 వచ్చాయి. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 95,148కి పెరిగింది.