Uniform Civil Code: ఉమ్మడి పౌరస్మృతిపై ఉత్తరాఖండ్‌ సీఎం ధామీ కీలక ప్రకటన

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజే పుష్కర్‌సింగ్‌ ధామీ ఉమ్మడి పౌరస్మృతిపై కీలక నిర్ణయం తీసుకున్నారు.

Published : 25 Mar 2022 01:26 IST

దేహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజే పుష్కర్‌సింగ్‌ ధామీ ఉమ్మడి పౌరస్మృతిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేందుకు నిపుణులతో కూడిన హై పవర్‌ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గురువారం జరిగిన కేబినెట్‌ తొలి భేటీలో ఆమోద ముద్ర పడినట్లు తెలిపారు. ఇది అమలైతే ఉమ్మడి పౌరస్మృతి తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా నిలవనుందని ధామీ చెప్పారు. బహుశా ఇప్పటికే గోవాలో అమల్లో ఉందని పేర్కొన్నారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ.. ఉమ్మడి పౌరస్మృతి అమలుకు సంబంధించి ముసాయిదాను రూపొందిస్తుందని, ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుందని ధామీ చెప్పారు. దీన్ని ఇతర రాష్ట్రాల కూడా అనుసరిస్తాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. హిమాలయ రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌.. భిన్న సంస్కృతులు, భిన్న మతాల సమ్మేళనమని, దీనికితోడు రెండు దేశాలతో రాష్ట్రానికి సరిహద్దులు ఉండడం వల్ల ఉమ్మడి పౌరస్మృతి అవసరమని నొక్కి చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 44లో ప్రోవిజన్‌ ఉందని, దీన్ని అమలు చేయకపోవడం పట్ల సుప్రీంకోర్టు సైతం గతంలో అసహనం వ్యక్తంచేసిందని ధామీ పేర్కొన్నారు.

గోవాలో ఇప్పటికే ఉమ్మడి పౌరస్మృతి అమల్లో ఉంది. పోర్చుగీస్‌ సివిల్‌ కోడ్‌, 1867ను గోవా అనుసరిస్తోంది. ఇక ఒకసారి ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వస్తే.. వివాహం, వారసత్వం, ఆస్తి హక్కులకు సంబంధించి ఒకే చట్టం అమల్లో ఉంటుంది. అంటే హిందూ వివాహ చట్టం, 1955, హిందూ వారసత్వ చట్టం 1956 లేదా భారత వారసత్వ చట్టం 1925, షరియత్‌ చట్టం, 1937 వంటివి ఇక చెల్లుబాటులో ఉండవు. మరోవైపు ఉమ్మడి పౌరస్మృతిని తీసుకొచ్చే అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వివాహం, విడాకులు, వారసత్వం, ఆస్తి హక్కులు వంటి అంశాలు రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలోకి వస్తాయని రాజ్యాంగ నిపుణులు, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్‌ పీడీటీ ఆచారి పేర్కొన్నారు. ఇలాంటి చట్టాన్ని తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికీ అధికారం ఉంటుందని చెప్పారు. ఇలాంటి చట్టాలు చేసే అధికారం పార్లమెంట్‌ ద్వారా కేవలం కేంద్రానికి మాత్రమే ఉంటుందని కేంద్ర మాజీ న్యాయ కార్యదర్శి పీకే మల్హోత్రా పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు