మళ్లీ నోరుపారేసుకున్న ఉత్తరాఖండ్‌ సీఎం

మహిళల వస్త్రధారణపై వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కిన ఉత్తరాఖండ్‌ నూతన ముఖ్యమంత్రి తీరత్‌ సింగ్‌ రావత్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రభుత్వం అందించే రేషన్‌ ఎక్కువ కావాలనుకునేవారు

Published : 22 Mar 2021 11:37 IST

రాంనగర్‌: మహిళల వస్త్రధారణపై వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కిన ఉత్తరాఖండ్‌ నూతన ముఖ్యమంత్రి తీరత్‌ సింగ్‌ రావత్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రభుత్వం అందించే రేషన్‌ ఎక్కువ కావాలనుకునేవారు మరింత మంది పిల్లలను కనాల్సింది కదా’’ అంటూ నోరుపారేసుకున్నారు.

 ‘‘పేద కుటుంబాలకు కేంద్రం ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున రేషన్‌ అందిస్తోంది. ఇంట్లో 10 మంది ఉంటే వారికి 50కిలోల రేషన్‌ వస్తుంది. 20 మంది ఉంటే క్వింటాల్‌ అందుతుంది. ఇద్దరే ఉన్నవారికి 10కిలోలు మాత్రమే వస్తుంది. అలాంటప్పుడు ఎక్కువ రేషన్‌ వచ్చే వారిపై అసూయ ఎందుకు? మీకు సమయం ఉంది కదా.. అప్పుడెందుకు 20 మంది పిల్లలను కనలేదు’’ అని తీరత్‌ వ్యాఖ్యానించడంతో దుమారం రేగింది. 

తీరత్‌ ఇలా వార్తల్లోకెక్కడం ఇదే తొలిసారి కాదు. ఇద్దరు పిల్లల తల్లై ఉండీ ఒకావిడ చిరిగిన జీన్స్‌ వేసుకుందని, అలాంటావిడ సభ్య సమాజానికి ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారంటూ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత నిన్న ఓ బహిరంగసభలో మాట్లాడుతూ.. మన దేశాన్ని 200ఏళ్ల పాటు అమెరికా పాలించిందంటూ నోరుజారారు. కొవిడ్‌ కట్టడిలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ మిన్నగా వ్యవహరించిందని చెప్పే సమయంలో.. ‘‘మన దేశాన్ని 200 ఏళ్ల పాటు ఏలిన అమెరికా సైతం నేడు కొవిడ్‌ కట్టడికి తీవ్రంగా శ్రమిస్తోంది’’ అని అన్నారు. బ్రిటన్‌కు బదులు అమెరికా అని పలకడంతో సోషల్‌మీడియాలో ఆయనపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని