Uttarakhand: ఉత్తరాఖండ్‌.. అసెంబ్లీ పోరుకు సిద్ధమైన దేవభూమి

దేవభూమిగా పేరుగాంచిన ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమైంది. మొత్తం 13 జిల్లాల్లోని 70 శాసనసభ స్థానాలకు సోమవారం పోలింగ్‌ జరగనుంది.

Published : 13 Feb 2022 21:45 IST

70 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్‌

దేహ్రాదూన్‌: దేవభూమిగా పేరుగాంచిన ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమైంది. మొత్తం 13 జిల్లాల్లోని 70 శాసనసభ స్థానాలకు సోమవారం పోలింగ్‌ జరగనుంది. దాదాపు 81లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల బరిలో 632 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా వీరిలో 152 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకూ అక్కడ పోలింగ్‌ జరగనుంది. బహిరంగ సభలు, వర్చువల్‌ ప్రసంగాలు, ఇంటింటి ప్రచారంతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముగించాయి. 2000 సంవత్సరంలో కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి అక్కడ అసెంబ్లీకి ఎన్నికలు జరగడం ఇది ఐదోసారి.

ఎన్నికల బరిలో ప్రముఖులు..

అధికార పార్టీ తరపున ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి, కేబినెట్‌ మంత్రులు సత్పాల్‌ మహరాజ్‌, సుబోధ్‌ ఉనియాల్‌, అరవింద్‌ పాండే, ధాన్‌సింగ్‌ రావత్‌తోపాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మదన్‌ కౌశిక్‌ వంటి ప్రముఖులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక ప్రత్యర్థి కాంగ్రెస్‌ పార్టీ నుంచి మాజీ ముఖ్యమంత్రి హరీశ్‌ రావత్‌, మాజీ మంత్రి యశ్‌పాల్‌ ఆర్య, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్‌ గొడియాల్‌తోపాటు ప్రీతం సింగ్‌ వంటి సీనియర్‌ నేతలు పోటీలో ఉన్నారు. ఈసారి ఉత్తరాఖండ్‌లో ఎన్నికల బరిలో నిలిచిన ఆమ్‌ఆద్మీ పార్టీతోపాటు సమాజ్‌వాదీ పార్టీలు కూడా ముమ్మరంగానే ప్రచారం నిర్వహించాయి.

ప్రచారంలో జాతీయ నేతలు..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, యోగీ ఆదిత్యనాథ్‌లు ప్రచారంలో పాల్గొనగా.. కాంగ్రెస్‌ నుంచి రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ వంటి జాతీయ నేతలు ప్రచారం నిర్వహించారు. ఆమ్‌ఆద్మీ పార్టీ నుంచి అరవింద్‌ కేజ్రీవాల్‌, మనీష్‌ సిసోడియాలు ప్రచారం నిర్వహించారు. మరోవైపు బీఎస్‌పీ అధినేత్రి మాయావతి కూడా ప్రచారంలో పాల్గొన్నారు.

ఉత్తరాఖండ్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా భారీ విజయం సాధించింది. 70 అసెంబ్లీ స్థానాలకు గానూ 57 సీట్లలో గెలుపొందింది. కాంగ్రెస్‌ మాత్రం కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. గతకొన్నేళ్లుగా భాజపా, కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోటీ ఉంటోన్న ఉత్తరాఖండ్‌లో.. ఒకరి తర్వాత మరొకరు అధికారంలోకి వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇదే సమయంలో ఈసారి ఆమ్‌ఆద్మీ పార్టీ బరిలో నిలవడం ఆ రెండు పార్టీలకు సవాల్‌గా మారినట్లు తెలుస్తోంది. మొత్తం 70 స్థానాల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ తమ అభ్యర్థులను రంగంలోకి దించింది.

ఎవరి ధీమా వారిదే..

రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, రైల్వే, రహదారుల నిర్మాణంతో పాటు కేదారినాథ్‌ ఆలయ పునర్నిర్మాణం వంటి హామీలతో భాజపా ప్రచారం చేసింది. అందుకే వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు అవకాశం కల్పించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేసింది. మరోవైపు భాజపా హయాంలో రాష్ట్రంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నాలుగు నెలల్లోనే ముగ్గురు ముఖ్యమంత్రుల మార్పు వంటి అంశాలను కాంగ్రెస్‌ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఇక కొత్తగా వచ్చిన ఆమ్‌ఆద్మీ మాత్రం రాష్ట్రం ఏర్పడి రెండు దశాబ్దాలైనా.. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో భాజపా, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించింది. ఆమ్‌ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 18ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు నెలకు వెయ్యి రూపాయల ఆర్థిక సహాయం, ప్రతి కుటుంబానికి ఓ ఉద్యోగం, రూ.5వేల నిరుద్యోగ భృతి వంటి హామీలను ఆప్‌ ప్రకటించింది.

ఇక రాష్ట్రంలో 81లక్షలకుపైగా ఓటర్లు ఉండగా వీరికోసం 11,697 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేసినట్లు చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ సౌజన్య వెల్లడించారు. మహిళల కోసం ‘సఖి’ పోలింగ్‌ బూత్‌ పేరుతో తొలిసారి 101 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాట్లు చేశామన్నారు. ఇందులో సిబ్బంది మొత్తం మహిళలే ఉంటారని.. ఎన్నికల్లో మహిళా ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచడంలో భాగంగా ఈ ఏర్పాటు చేశామని చెప్పారు. వీటితోపాటు దివ్యాంగుల కోసం పలుచోట్ల ప్రత్యేక పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశామని, ఆ కేంద్రాల్లోని సిబ్బంది కూడా దివ్యాంగులే ఉంటారని రాష్ట్ర ఎన్నికల అధికారి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని