Joshimath: విపత్తు ప్రభావిత ప్రాంతంగా జోషీమఠ్‌..!

ప్రభుత్వం జోషీమఠ్‌(Joshimath)ను విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించింది. మరోవైపు ఎన్‌టీపీసీ ప్రాజెక్టు, రహదారి నిర్మాణాలను నిలిపివేశారు.

Updated : 09 Jan 2023 14:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌(Joshimath) ప్రాంతాన్ని విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించినట్లు ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా కలెక్టర్‌ హిమాన్షూ ఖురాన సోమవారం తెలిపారు. అక్కడ భూమి కుంగుతున్న ప్రాంతం పెరగిపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నట్లు వివరించారు. రెండు కేంద్ర నిపుణుల బృందాలు ఇక్కడికి వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వీటిల్లో జల్‌శక్తి మంత్రిత్వ శాఖ నిపుణులు కూడా ఉన్నట్లు వెల్లడించారు. ‘‘జోషీమఠ్‌, సమీప ప్రాంతాల్లో నిర్మాణ పనులపై నిషేధం విధించాం. ఇక్కడ విపత్తు ప్రభావిత ప్రజలకు రేషన్‌ కిట్లు అందజేశాం’’ అని పేర్కొన్నారు. ఇక్కడ 603 భవనాలు భూమి కుంగుబాటు ప్రభావానికి గురయ్యాయి. 68 కుటుంబాలను తరలించారు. ఆ కుటుంబాలు తలదాచుకొనేందుకు 223 గదులను అధికారులు గుర్తించారు. ప్రమాదకర పరిస్థితుల్లో ఇంకా ఉంటున్న వారిని తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇక ఎన్టీపీసీకి చెందిన తపోవన్‌-విష్ణుగడ్‌ ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేయాలని అధికారలు ఆదేశించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పనులు చేపట్టకూడదని పేర్కొన్నారు. అంతేకాదు ఈ పట్టణానికి నిర్మిస్తున్న బైపాస్‌ పనులను కూడా ఆపేశారు. జోషీమఠ్‌(Joshimath) ప్రజలకు తక్షణ ఉపశమనం కల్పించాలని కోరుతూ స్వామి అవిముక్తేశ్వరానంద సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆ పిటిషన్‌లో కోరారు. ఇక్కడ జ్యోతిర్మఠాన్ని కాపాడేందుకు అనుసరించాల్సిన ఆచారాలపై చర్చించేందుకు ధర్మశాస్త్ర నిపుణులను పిలిపించనున్నట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని