నిరసనలు ఆపండి.. రోడ్లు ఖాళీ చేయండి! 

కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు యూపీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దిల్లీ  - యూపీ .......

Updated : 28 Jan 2021 21:23 IST

రైతులకు యూపీ అధికారుల ఆదేశం 

దిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు యూపీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దిల్లీ  - యూపీ సరిహద్దులోని  ఘాజీపూర్‌  వద్ద ఆందోళన విరమించి రోడ్లను ఖాళీ చేయాలని ఘజియాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. ఇందుకోసం ఈ రాత్రి వరకు గడువు విధించారు. ఒకవేళ రైతులు ఖాళీ చేయకపోతే తామే బలవంతంగా ఖాళీ చేయించాల్సి ఉంటుందని హెచ్చరించినట్టు సమాచారం. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రిపబ్లిక్‌ డే రోజున దిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల పరేడ్‌ హింసాత్మకంగా మారిన నేపథ్యంలో అన్నదాతల నిరసనల పట్ల యూపీ కఠిన వైఖరి తీసుకుంది. రైతుల నిరసనల దృష్ట్యా నవంబర్‌ 26 నుంచి ఘజీపూర్‌ సరిహద్దును మూసివేశారు. అయితే, రైతులు మంగళవారం రోజున బారికేడ్లను ధ్వంసం చేసి ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టారు. మరోవైపు, జాతీయ రహదారుల పనులు పెండింగ్‌లో ఉండటంతో నేషనల్‌ హైవేల అథారిటీ నుంచి తమకు అభ్యర్థనలు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు.

రైతులకు వ్యతిరేకంగా స్థానికుల నినాదాలు  
మరోవైపు, సాగు చట్టాలకు వ్యతిరేకంగా 60 రోజులకు పైగా ఆందోళన కొనసాగిస్తున్న రైతు సంఘాలు దిల్లీ సరిహద్దుల నుంచి వెళ్లిపోవాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. సింఘూ సరిహద్దులో ఆందోళనకు దిగిన స్థానికులు.. రైతుల ఆ ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని డిమాండ్‌ చేశారు. ఈ ఆందోళనల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు సింఘూ సరిహద్దు నుంచి రైతులు వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఇదీ చదవండి..

దిల్లీ ఘటన: రైతు నేతలపై లుకౌట్‌ నోటీసులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని