అప్పుడే ఇతర వర్గాలకు టీకా:గులేరియా

దేశంలో కరోనా కోరలు చాస్తున్న వేళ.. మరిన్ని సమూహాలకు టీకాలు వేయాల్సి ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా అన్నారు.

Published : 04 Apr 2021 01:56 IST

దిల్లీ: దేశంలో కరోనా కోరలు చాస్తున్న వేళ.. మరిన్ని సమూహాలకు టీకాలు వేయాల్సి ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా అన్నారు. జనవరి 16న ప్రారంభమైన టీకా కార్యక్రమం కింద ఏప్రిల్ ఒకటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి టీకాలు ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంకా చిన్నవయసు వారిని దీని కిందికి తీసుకురావాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, ఆ విషయంలో టీకా లభ్యత కీలకాంశం కానుందని వెల్లడించారు.

తాజాగా గులేరియా మీడియాతో మాట్లాడుతూ..‘మనది జనాభా పరంగా పెద్దదేశం. వయోజనులందరికీ అంటే.. సుమారు 100 కోట్ల మందికి టీకాలు వేయాల్సి ఉంటుంది. అందుకోసం 200 కోట్ల టీకా డోసులు అవసరం. కాకపోతే అన్ని టీకా డోసులను పొందే అవకాశం లేదు. అందుకే టీకా సమతుల్యతను పాటిస్తూ..ప్రాధాన్య వర్గాలకు టీకాలు అందించాల్సిన అవసరం ఉంది’ అని స్పష్టత ఇచ్చారు.

టీకా కార్యక్రమంలో ఆశించినంత వేగం కనిపించడం లేదని ప్రశ్నించగా.. దిల్లీ ఎయిమ్స్ ఐదు టీకా కేంద్రాలను ఏర్పాటు చేసిందని, నిత్యం 600 మంది టీకాలు వేయించుకుంటున్నారని తెలిపారు. గురువారం 996 మందికి టీకాలు వేసామని, త్వరలోనే 1,000 మార్కును దాటుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ పదిరోజుల తరవాత వచ్చే వారి సంఖ్య 50 శాతానికి తగ్గిపోతే, ప్రస్తుత ప్రాధాన్య వర్గాల విషయంలో మనం ఆశించిన స్థాయికి చేరినట్లేనని ఆయన వెల్లడించారు. అప్పుడు ఇంతకంటే చిన్నవయసు వారిని టీకా కార్యక్రమంలో చేర్చవచ్చని తెలిపారు. ప్రస్తుతం మూడు దశల్లో భాగంగా నడుస్తోన్న కరోనా టీకా కార్యక్రమం కింద కేంద్రం ఏడు కోట్లకు పైగా టీకా డోసులను పంపిణీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని