Vaccination: ఒకే సిరంజీతో 39 మంది విద్యార్థులకు కొవిడ్‌ టీకా!

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం విస్తృతంగా సాగుతున్నప్పటికీ.. మధ్యమధ్యలో కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఒక టీకాకు బదులు మరో టీకా ఇవ్వడం.

Updated : 28 Jul 2022 16:44 IST

భోపాల్‌: కరోనా మహమ్మారిని అరికట్టేందుకు దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం విస్తృతంగా సాగుతున్నప్పటికీ.. మధ్యమధ్యలో కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఒక టీకాకు బదులు మరో టీకా ఇవ్వడం.. ఒకే వ్యక్తికి అధిక డోసులు ఇవ్వడం వంటి ఘటనలు కొన్నాళ్ల క్రితం బయటికొచ్చాయి. తాజాగా ఇలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యాక్సినేటర్‌ ఒకే సిరంజీతో 39 మంది విద్యార్థులు టీకా వేశాడు. ఇదేంటని అడిగితే పైఅధికారులు తనకు ఒకటే పంపించారని, తన తప్పేమీ లేదని చెప్పడం గమనార్హం. వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ నగరంలోని  జైన్‌ పబ్లిక్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో బుధవారం మెగా వ్యాక్సినేషన్‌ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో టీకాలు వేసేందుకు జితేంద్ర అనే వ్యక్తి వ్యాక్సినేటర్‌గా వచ్చాడు. అయితే, వ్యాక్సిన్‌ తీసుకునేందుకు వచ్చిన 39 మంది విద్యార్థులకు ఒకే సిరంజీతో టీకాలు వేశాడు. దీన్ని తల్లిదండ్రులు గుర్తించి ప్రశ్నించగా.. ‘‘వ్యాక్సిన్‌ మెటీరియల్‌ తీసుకొచ్చిన వ్యక్తి ఒకే సిరంజీ డెలివరీ చేశాడు. ఒక సూదిని ఒకసారే ఉపయోగించాలని నాకు తెలుసు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా. ఒకే సిరంజీతో అందరికీ టీకాలు వేయమంటారా అని అడిగితే సరే అన్నారు. ఇందులో నా తప్పేముంది. వాళ్లు చెప్పిందే నేను చేశా’’ అని జితేంద్ర చెప్పాడు.

దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఇంఛార్జి కలెక్టర్‌ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆదేశం మేరకు చీఫ్‌ మెడికల్ హెల్త్‌ అధికారి ఘటనాస్థలానికి చేరుకోగా.. అప్పటికే జితేంద్ర అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతడి ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌ అని వస్తోంది. దీంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా టీకాల పంపిణీకి ఇన్‌ఛార్జ్‌ అయిన జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డా. రాకేశ్‌ రోషన్‌పై విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు కాగా.. ఉన్నతాధికారులు ఆ వ్యాక్సినేటర్‌ను సస్పెండ్‌ చేశారు.

1990ల్లో హెచ్‌ఐవీ వ్యాప్తి మొదలైన తర్వాత నుంచి సిరంజీలను ఒకసారి మాత్రమే వినియోగిస్తోన్న విషయం తెలిసిందే. 2021లో దేశంలో టీకా పంపిణీ ప్రారంభానికి ముందు కూడా కేంద్ర ఆరోగ్యశాఖ ఈ విషయాన్ని మరోసారి గుర్తుచేసింది. ‘ఒక సూది, ఒక సిరంజీ, ఒకేసారి’ అని నిబంధనను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని