UK: కొవిషీల్డ్‌ ఓకే కానీ.. టీకా సర్టిఫికేట్‌కు కనీస ప్రమాణాలుండాలి..!

భారత్‌లో తయారుచేసిన కొవిషీల్డ్‌ టీకాతో తమకు ఎలాంటి సమస్య లేదని, వ్యాక్సిన్‌ సర్టిఫికేట్‌తోనే సమస్య ఉందని చెబుతోన్న బ్రిటన్‌ ప్రభుత్వం.. తాజాగా టీకా ధ్రువీకరణ

Published : 23 Sep 2021 11:46 IST

యూకే ప్రభుత్వం స్పష్టం

లండన్‌: భారత్‌లో తయారుచేసిన కొవిషీల్డ్‌ టీకాతో తమకు ఎలాంటి సమస్య లేదని, వ్యాక్సిన్‌ సర్టిఫికేట్‌తోనే సమస్య ఉందని చెబుతోన్న బ్రిటన్‌ ప్రభుత్వం.. తాజాగా టీకా ధ్రువీకరణ పత్రాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత దేశాలు జారీ టీకా ధ్రువీకరణ పత్రాలకు కనీస ప్రమాణాలుండాలని యూకే ప్రభుత్వం వ్యాఖ్యానించింది. ఇక, తమ అంతర్జాతీయ ప్రయాణ నిబంధనలపై దశల వారీ విధానంలో భారత్‌తో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది. 

ఆస్ట్రాజెనెకా కొవిషీల్డ్‌ను బ్రిటన్‌ అంతర్జాతీయ పర్యాటక అడ్వైజరీ ఆమోదిత సూత్రీకరణల జాబితాలో చేర్చుతున్నట్లుగా బ్రిటన్‌ బుధవారం ప్రకటించింది. ఈ మేరకు సవరణ అడ్వైజరీ జారీచేసింది. అయితే, ఆమోదించిన టీకాలకు సంబంధించి 18 దేశాలతో రూపొందించిన జాబితాలో మాత్రం భారత్‌ను ఇప్పటికీ చేర్చలేదు. దీని వల్ల భారతీయులు టీకాలు తీసుకున్నప్పటికీ బ్రిటన్‌ వెళ్లిన తర్వాత 10 రోజులు క్వారంటైన్‌లో ఉండాలి.

ఈ సవరణ అడ్వైజరీపై ఇంకా గందరగోళం తొలగకపోవడంతో యూకే ప్రభుత్వం తాజాగా మరో ప్రకటన చేసింది. ‘‘ప్రజా ఆరోగ్యమే మాకు ముఖ్యం. అందుకే అత్యంత భద్రతతో అంతర్జాతీయ ప్రయాణాలను పునఃప్రారంభించాం. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. దేశాలు జారీ చేసే టీకా సర్టిఫికేట్లు కనీస ప్రమాణాలు కలిగి ఉండాలి. అంతర్జాతీయ ప్రయాణ నిబంధనలపై భారత్‌ సహా అంతర్జాతీయ భాగస్వాములతో దశల వారీ విధానంలో కలిసి పనిచేస్తున్నాం’’ అని పేర్కొంది. అయితే భారత్‌ సహా ఇతర దేశాల టీకా ధ్రువీకరణ పత్రాలను ఆమోదించేందుకు బ్రిటన్‌ రూపొందించిన కనీస ప్రమాణాలేంటో మాత్రం ఆ దేశ ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేదు. 

కొవిన్‌ యాప్‌ డెవలపర్లతో చర్చలు..

ఇదిలా ఉండగా.. టీకా సర్టిఫికేట్ల పై కొవిడ్‌ యాప్‌, ఎన్‌హెచ్‌ఎస్‌ యాప్‌ రూపకర్తలతో చర్చలు జరుపుతున్నట్లు బ్రిటన్‌కు బ్రిటన్‌ హైకమిషనర్‌ అలెక్స్‌ ఎల్లిస్‌ వెల్లడించారు. ఈ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందని తెలిపారు. అతిత్వరలోనే దీనికి పరిష్కారం లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని