Published : 07 Jan 2021 01:25 IST

కరోనా టీకా: డోసుల వ్యవధి ఎంత ఉండాలి?

దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు

వాషింగ్టన్‌: కరోనా నిరోధక వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఇప్పటికే అమెరికా, చైనా, ఇజ్రయెల్‌, బ్రిటన్‌, యూఏఈ, రష్యా, బహ్రయిన్‌ తదితర దేశాలతో పాటు జర్మనీ, ఇటలీ వంటి యూరోపియన్‌ దేశాల్లో కూడా ప్రారంభమైంది. అంతర్జాతీయ గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా జనవరి 5 నాటికి ఇంచుమించు కోటి 45 లక్షల డోసుల కరోనా టీకా డోసులను ప్రజలకు అందచేశారు. అమెరికా ఇప్పటికే తొలి సారి వ్యాక్సిన్‌ వేయించుకున్న వారికి రెండోడోసు అందించే ఏర్పాట్లు చేస్తోంది. కాగా, రెండోసారి ఇచ్చే బూస్టర్‌ డోసులను కాస్త పక్కన పెట్టి.. మరింత మందికి తొలి డోసును అందించటమే సరైన చర్య అని బ్రిటన్‌ భావిస్తోంది. తక్కువ పరిమాణంలో నిల్వలు అందుబాటులో ఉన్న పరిస్థితిలో.. రెండు డోసుల మధ్య కాల వ్యవధిని పెంచటం సరైన చర్య అని కొందరు నిపుణుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ డోసుల మధ్య వ్యవధికి సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

టీకా డోసుల మధ్య వ్యవధి ఎంత ఉండాలి?

రెండు డోసుల మధ్య కాల వ్యవధి 12 వారాలున్నా ఫర్వాలేదని బ్రిటిష్‌ వైద్య నిపుణులు ఇటీవల ప్రకటించారు. ఈ వ్యవధిని పెంచటం వల్ల.. దీర్ఘకాలంలో మేలే అని ఆస్ట్రాజెనెకా టీకా ప్రయోగాల్లో వెల్లడైనట్టు వారు తెలిపారు. ఐతే, తొలి డోసు వల్ల లభించే రక్షణ 21 రోజుల మించి పనిచేయదని ఫైజర్‌ అంటోంది. కాగా, అగ్రరాజ్యం తొలి నుంచీ ఒకే షెడ్యూలుకు కట్టుబడింది. నాలుగు వారాల లోగా రెండో టీకా ఇవ్వాలని అమెరికా ప్రభుత్వ సంస్థ ఎఫ్‌డీఏ తెలిపింది. ఇక ఫైజర్‌ వ్యాక్సిన్‌ విషయంలో రెండు డోసులకు మధ్య 21 నుంచి 28 రోజుల తేడా ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.

తక్కువ మోతాదు డోసులు మరింత మేలా?

మోడర్నా టీకా డోసులను కుదించి.. సగం సగం ఇవ్వడం కూడా సరైనదే అని అమెరికా కొవిడ్‌ టీకా కార్యక్రమం ‘ఆపరేషన్‌ వార్ఫ్‌ స్పీడ్‌’ సలహాదారు డాక్టర్‌ మోన్సెఫ్‌ లావోరీ వెల్లడించారు. ఈ విధానంలో 18 నుంచి 55 ఏళ్ల మధ్ వయస్సున్న వారికి మంచి రోగ నిరోధకత లభిస్తుందని ఆయన తెలిపారు. ఐతే మోడెర్నా టీకా 30 వేల మందిపై చేపట్టిన ప్రయోగాల ఆధారంగా.. 28 రోజుల తేడాతో రెండు పూర్తి డోసులు ఇచ్చినప్పుడు ప్రభావం అత్యధికంగా అంటే 95 శాతం ఉన్నట్టు ఎఫ్‌డీఏ తెలిపింది.

ఏయే వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి?

ప్రస్తుతం అమెరికాలో ఫైజర్‌, మోడెర్నా సంస్థల టీకాలు అందుబాటులో ఉండగా.. బ్రిటన్‌ ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా టీకాలను పంపిణీ చేస్తోంది.ఇక యూరోపియన్‌ సమాఖ్య దేశాల్లో ఫైజర్‌ టీకాను అందచేస్తున్నారు. భారత్‌లో ఇప్పటి వరకు సీరం ఇన్‌స్టిట్యూట్‌ తయారీ కొవిషీల్డ్‌.. భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌లకు అత్యవసర వినియోగ అనుమతులు లభించాయి. ఐతే టీకా ఏ సంస్థకు చెందినదైనా.. రెండు డోసులు తీసుకోవటం మాత్రం తప్పనిసరి.

అమెరికాలో ప్రాధమిక దశలో వ్యాక్సినేషన్‌.. నిపుణులు ఆశించినంత వేగంగా జరగలేదు. సోమవారం నాటికి అమెరికాలో కోటిన్నర టీకా డోసులు అందుబాటులో ఉండగా.. కేవలం 45 లక్షల డోసులు మాత్రమే ఉపయోగించినట్టు వెల్లడైంది. 

ఇవీ చదవండి..

జనవరి 13 లోగానే భారత్‌లో టీకా..

భారత్‌లో టీకా పొందటం ఎలా..

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని