భారత్‌ టీకాలు: 76 దేశాలకు 6కోట్ల డోసులు!

ప్రపంచ వ్యాప్తంగా 76దేశాలకు 6కోట్లకుపైగా వ్యాక్సిన్‌ డోసులను ఎగుమతి చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Published : 22 Mar 2021 01:48 IST

దేశవ్యాప్తంగా 4.5కోట్ల డోసులు పంపిణీ

ఛండీగఢ్‌: ఓవైపు దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ముమ్మరంగా కొనసాగిస్తోన్న కేంద్ర ప్రభుత్వం, మరోవైపు విదేశాలకూ సరఫరా చేస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 76దేశాలకు 6కోట్లకుపైగా వ్యాక్సిన్‌ డోసులను ఎగుమతి చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 4.5కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను ఇచ్చినట్లు పేర్కొంది. వ్యాక్సిన్‌ పంపిణీని ప్రజా ఉద్యమంగా మార్చాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుమేరకు భారీ స్థాయిలో చేపడుతున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు.

దేశంలో నిత్యం దాదాపు 20లక్షల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేస్తున్నారు. నిన్న ఒక్కరోజే 25లక్షల 40వేల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇలా ఇప్పటివరకు 4కోట్ల 46లక్షల డోసులను అందించారు. వీటిలో 3కోట్ల 71లక్షల మందికి తొలి డోసులను అందించగా, 74లక్షల మందికి రెండు డోసులను ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

ప్రపంచ వ్యాప్తంగా 133 దేశాల్లో..

కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 133దేశాల్లో అందుబాటులోకి వచ్చినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. మొత్తం ఇప్పటివరకు 43కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు సమాచారం. ప్రపంచంలో నిత్యం దాదాపు కోటి డోసులను అందిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. భారీ స్థాయిలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తోన్న దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఇప్పటివరకు అక్కడ 12కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు అమెరికా వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ) వెల్లడించింది. ఇక చైనాలో 6కోట్ల 49లక్షల డోసులు, యూరోపియన్‌ యూనియన్‌లో 5కోట్ల 60లక్షల డోసులు అందించగా, భారత్‌లో ఈ సంఖ్య 4.5కోట్లకు చేరింది. ప్రస్తుతం అమెరికాలో మూడు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రాగా, భారత్‌లో రెండు వ్యాక్సిన్‌లకు అనుమతి లభించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని