ఆగస్టు నుంచి నెలకు 16 కోట్ల టీకాలు అవసరం..

ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి దేశంలో 18 ఏళ్లు దాటిన వారందరికీ టీకాలు వేస్తామని ప్రభుత్వ నిపుణుల కమిటీ అధిపతి డాక్టర్‌ ఎన్‌.కె.అరోరా పేర్కొన్నారు.

Updated : 09 Dec 2022 15:55 IST

 వెల్లడించిన నిపుణుల కమిటీ అధ్యక్షుడు డాక్టర్‌ అరోరా

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి దేశంలో 18 ఏళ్లు దాటిన వారందరికీ టీకాలు వేస్తామని ప్రభుత్వ నిపుణుల కమిటీ అధిపతి డాక్టర్‌ ఎన్‌.కె.అరోరా పేర్కొన్నారు. ఆయన ఇటీవల ఓ ఆంగ్ల ఛానల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం లక్ష్యాన్ని చేరుకుంటుందన్న ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. రానున్న నెలల్లో వ్యాక్సిన్‌ పంపిణీని ఎలా పెంచుతారనేదే ఇక్కడ అత్యంత కీలకమైన అంశమన్నారు. ప్రస్తుతానికి టీకాల అందుబాటు క్రమంగా పెరుగుతోందని అభిప్రాయపడ్డారు. మే వరకు నెలకు 5.6 కోట్ల డోసులు అందుబాటులోఉండేవన్నారు. ఇప్పుడు వాటి సంఖ్య నెలకు 10 కోట్ల నుంచి 12 కోట్లకు చేరిందని అరోరా పేర్కొన్నారు. వచ్చే నెల ఇది 16 కోట్ల నుంచి 18 కోట్ల వరకూ చేరాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.

అదే సమయంలో రాష్ట్రాలు కూడా టీకా కేంద్రాల సంఖ్యను పెంచాల్సి ఉందని డాక్టర్‌ అరోరా సూచించారు. నిజమైన సవాలు ఇక్కడే ఎదురవుతుందని చెప్పారు. 75 వేల నుంచి లక్ష వరకు టీకా కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. వాటి సంఖ్య ప్రస్తుతం తక్కువగా ఉందన్నారు. టీకాల పంపిణీ పెరిగే కొద్దీ వీటి సంఖ్యను రాష్ట్రాలు పెంచాల్సి ఉందన్నారు.

దాదాపు 56 రోజుల తర్వాత గత మూడు రోజులుగా కొవిడ్‌ కేసులు మెల్లగా పెరుగుతున్నాయి. జులై 8వ తేదీన మొత్తం 11 రాష్ట్రాల్లో కేసులు పెరిగినట్లు గుర్తించారు. ప్రభుత్వం డిసెంబర్‌ చివరి నాటికి దేశంలో 60శాతం మందికి టీకా రెండు డోసులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకొంది. ఈ లక్ష్యానికి చేరాలంటే రోజుకు 87లక్షల టీకాలు ఇవ్వాలి. ప్రస్తుతం  రోజువారీ టీకాల సంఖ్య దాదాపు 40 లక్షల వరకే ఉంటోంది. అంటే లక్ష్యంలో సగం మాత్రమే. భారత్‌ను థర్డ్‌వేవ్‌ కూడా 6 నుంచి 8 వారాలపాటు ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉందని ఇటీవల ఎయిమ్స్‌ చీఫ్‌ రణ్‌దీప్‌ గులేరియా హెచ్చరించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని