కొత్త రకాన్ని ఎదుర్కొనేలా టీకాను మార్చొచ్చా?

వ్యాక్సిన్‌ రాకతో కాస్త కుదుటపడుతున్న ప్రపంచాన్ని కొత్త రకం కరోనా మళ్లీ కలవరంలోకి నెట్టింది. దీంతో ఇప్పటికే అభివృద్ధి చేసిన టీకాలు పనిచేస్తాయా? లేదా? అన్న అనుమానాలు అందరిలో రేకెత్తుతున్నాయి. వైద్య నిపుణుల మాత్రం కొత్త రకాన్ని ఎదుర్కొనేలా టీకాను మార్చడం పెద్ద పనేమీ కాదంటున్నారు..........

Updated : 25 Dec 2020 11:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వ్యాక్సిన్‌ రాకతో కాస్త కుదుటపడుతున్న ప్రపంచాన్ని కొత్త రకం కరోనా మళ్లీ కలవరంలోకి నెట్టింది. దీంతో ఇప్పటికే అభివృద్ధి చేసిన టీకాలు పనిచేస్తాయా? లేదా? అన్న అనుమానాలు అందరిలో రేకెత్తుతున్నాయి. వైద్య నిపుణులు మాత్రం కొత్త రకాన్ని ఎదుర్కొనేలా టీకాను మార్చడం పెద్ద పనేమీ కాదంటున్నారు. నిమిషాల్లో కొత్త టీకాను సృష్టించొచ్చని తెలిపారు. వైరస్‌ రూపాంతరం చెందుతున్న కొద్దీ వ్యాక్సిన్‌ను సైతం అందుకు అనుగుణంగా మార్చొచ్చని వెల్లడించారు.

నిమిషాలు చాలు...

ఇలా వ్యాక్సిన్‌ను పునర్‌నిర్మించడం నిమిషాల్లో జరిగే ప్రక్రియ అని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన మెడిసిన్‌ ప్రొఫెసర్‌ డ్రూ వెస్‌మన్‌ తెలిపారు. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన రెండు ప్రఖ్యాత వ్యాక్సిన్లలో ఒకదాన్ని రూపొందించిన బృందంలో వెస్‌మన్‌ పనిచేశారు. వైరస్‌ తరచూ రూపాంతంరం చెందుతోందని.. తద్వారా ఇతరులకు సోకే గుణం హెచ్చిస్తోందని ఆందోళన వ్యక్తమవుతున్న వేళ.. వెస్‌మన్‌ వంటి వారి వైద్య నిపుణుల ప్రకటన ఊరట కలిగిస్తోంది.

అనుమతి లభించడమే ఆలస్యం...

అయితే, టీకాను కొత్త రకాల్ని ఎదుర్కొనేలా మార్చినప్పటికీ.. అనుమతి ప్రక్రియకు మాత్రం నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం రావొచ్చని వెస్‌మన్‌ తెలిపారు. ఫైజర్‌, మోడెర్నా సహా ఇతర వ్యాక్సిన్ల అత్యవసర వినియోగ అనుమతికి అవలంబించిన ప్రక్రియే దీనికీ అనుసరించే అవకాశం ఉందని అంచనా వేశారు. భద్రత, రోగనిరోధకతను నిరూపించడం కోసం మరోసారి ప్రయోగాలు జరపాల్సి రావొచ్చని తెలిపారు. దీంతో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడానికి సమయం పట్టే అవకాశం ఉందన్నారు.

ఇందుకే అన్ని రూపాలనూ ఎదుర్కోగలదు..

వైరస్‌ రూపాంతరం చెందడాన్ని బట్టి చూస్తే అది మానవ శరీరంలోకి చొచ్చుకెళ్లేందుకు అనుగుణంగా మారుతున్నట్లు తెలుస్తోందని వెస్‌మన్‌ తెలిపారు. అందుకోసం మహమ్మారి కొత్త మార్గాల్ని అన్వేషించుకుంటోందన్నారు. అయితే, ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతికతతో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు రూపాంతరం చెందిన వైరస్‌ను దీటుగా ఎదుర్కోగలవని ఉద్ఘాటించారు. ఈ పద్ధతిలో మన శరీరంలో సహజంగా ఉండే ఎంఆర్‌ఎన్‌ఏలను పోలిన కృత్రిమ మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏలను శరీరంలోకి పంపిస్తారు. వైరస్‌ శరీరంపై దాడి చేయగానే ఈ ఆర్‌ఎన్‌ఏలు యాంటీబాడీల ఉత్పత్తికి దోహదం చేస్తాయి. ఈ యాంటీబాడీలు వైరస్‌లో ఉండే కొమ్ము భాగాలపై దాడి చేసి మన కణాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. కొత్త రకాల్లో ముఖ్యంగా కొమ్ము భాగాల్లోనే మార్పులు సంభవిస్తున్నట్లు గుర్తించారు. అయితే, యాంటీబాడీలు పూర్తి కొమ్ము భాగాన్ని చుట్టుముడతాయని తెలిపారు. ఎంత రూపాంతరం చెందినా.. కొమ్ము భాగంలో యాంటీబాడీలు దాడి చేయడానికి అనువుగా ఉండే ప్రాంతాలు ఇంకా అనేకం ఉంటాయని వివరించారు. ఈ నేపథ్యంలో ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతికతతో అభివృద్ధి చేసిన టీకాలు కొత్త రకాలపైనా సమర్థంగా పనిచేసేలా మార్చడం సులభమని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఇంకా లోతైన అధ్యయనం...

ఏదేమైనా కరోనా వైరస్‌పై ఇంకా లోతైన అధ్యయనం జరగాల్సిన అసవరం ఉందని మరికొంత మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా జన్యుక్రమాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకా అనేక పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు. అప్పటి వరకు అప్రమత్తంగా ఉంటూ వైరస్‌ కట్టడి నిబంధలను పాటించాలని సూచించారు. భవిష్యత్తుల్లో మరింత ప్రమాదకరమైన కొత్త రూపాలు వెలుగులోకి వచ్చే అవకాశాల్ని కొట్టిపారేయలేమన్నారు.

ఇవీ చదవండి..

మన టీకాపై ప్రపంచ దేశాల దృష్టి!

97 లక్షలమంది వైరస్‌ను జయించారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని