
NTAGI: ‘బూస్టర్ డోసు ఇంపార్టెన్స్‌పై స్పష్టత అవసరం.. అప్పుడే ముందడుగేస్తాం’
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో బూస్టర్ డోసు కాకుండా.. ముందు జాగ్రత్త(ప్రికాషన్) డోసులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోన్న విషయం తెలిసిందే. తాజాగా బూస్టర్ డోసు విషయమై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్(ఎన్టీఏజీఐ) చీఫ్ డా.ఎన్కే అరోడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ వార్తాసంస్థతో ఆయన మాట్లాడుతూ.. ‘బూస్టర్ డోసు ఇంపార్టెన్స్‌పై ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. ఇజ్రాయెల్, జర్మనీ వంటి దేశాలు ఇప్పటికే నాలుగో డోసు ఇస్తుండగా, బ్రిటన్, కెనడా కూడా ఈ మేరకు ప్లాన్ చేస్తున్నాయి. ప్రతి దేశం పరిస్థితులు భిన్నంగా ఉంటాయని తెలిసినప్పటికీ.. బూస్టర్ డోసు వెనుక ఉన్న సైన్స్‌పై మన అవగాహనలో కొంత గ్యాప్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో.. రాబోయే కొద్ది రోజులు దేశంలోని ఆసుపత్రుల్లో చేరికలను గమనించాలి. ఎవరికి ముప్పు ఎక్కువగా ఉందో గుర్తించాలి. ఆ తర్వాతే బూస్టర్ విషయంలో ముందడుగేస్తాం’ అని వెల్లడించారు. ఒమిక్రాన్‌పై కచ్చితమైన అవగాహన వచ్చేందుకు మరో రెండు, మూడు వారాలు పడుతుందన్నారు.
‘గర్భిణులు ముందుకు రావాలి’
దేశంలో 4.5 కోట్ల మంది గర్భిణులు, గర్భం దాల్చాలని భావిస్తున్నవారు ఉన్నారని, వారిలో 10 శాతం కంటే తక్కువ మంది మాత్రమే ఇప్పటివరకు టీకాలు వేయించుకున్నారని డా.అరోరా ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రెగ్నెన్సీలో మహిళలకు వైరస్ సోకే ప్రమాదం ఎక్కువ. ఈ విషయాన్ని వారు అర్థం చేసుకోవాలి. ఇప్పటివరకు 30 లక్షల మంది గర్భిణులకు టీకాలు ఇచ్చాం. తల్లీబిడ్డకు వ్యాక్సిన్ సురక్షితమేనని డేటా చూపుతోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు రావాలి’ అని కోరారు. చిన్నారులకు వ్యాక్సిన్ విషయమై మాట్లాడుతూ.. దేశంలో 44 కోట్లకు పైగా బాలబాలికలున్నారని, ఇప్పుడు 15- 18 ఏళ్లవారికి టీకా ఇస్తున్నామని, క్రమక్రమంగా అవసరమైన వారందరికీ పంపిణీ చేస్తామని చెప్పారు. ఒకేసారి అందరికీ ఇవ్వడం మొదలుపెడితే.. గందరగోళానికి దారితీస్తుందని, పైగా టీకా అవసరమైన వారికి అందకుండా పోతుందన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.