Vande Bharat Express: వరుసగా మూడో రోజు.. మధ్యలోనే ఆగిన మరో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌

 మొన్న గేదెలు.. నిన్న ఆవు.. నేడు సాంకేతిక లోపం.. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు వరుస ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి.

Published : 08 Oct 2022 17:51 IST

బులంద్‌షహార్‌: రైల్వేశాఖ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సెమీ హైస్పీడ్ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు వరుస ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి. గత రెండు రోజుల్లో ముంబయి-గాంధీనగర్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రెండుసార్లు పశువులను ఢీకొని ఆగిపోగా.. తాజాగా మరో వందే భారత్‌ రైలులో సాంకేతిక సమస్య ఏర్పడింది. శనివారం వారణాసి బయల్దేరిన ఈ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ట్రాక్షన్‌ మోటార్‌ జామ్‌ అవడంతో మధ్యలోనే ఆగిపోయింది.

దిల్లీ నుంచి వారణాసి బయల్దేరిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో‌.. మార్గమధ్యంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహార్‌ సమీపంలో దన్‌కౌర్‌, వేర్‌ స్టేషన్ల మధ్య రైలు సీ8 కోచ్‌కు సంబంధించిన ట్రాక్షన్‌ మోటార్‌లో బేరింగ్‌ పనిచేయలేదు. గ్రౌండ్‌ స్టాఫ్‌ ఈ లోపాన్ని గుర్తించి వెంటనే రైల్వే ఆపరేషన్స్‌ కంట్రోల్‌ వ్యవస్థను అప్రమత్తం చేశారు. దీంతో రైల్లోనే ఉన్న సాంకేతిక సిబ్బంది తనిఖీ చేసి.. ఎక్స్‌ప్రెస్‌ రైలును నియంత్రిత వేగంతో 20కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖుర్జా రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లి ఆపారు. అక్కడ 5 గంటల పాటు మరమ్మతులు చేసినా ఫలితం లభించలేదు. దీంతో అందులోని ప్రయాణికులను శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో గమ్యస్థానానికి చేర్చినట్లు రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని రైల్వే అధికారులు తెలిపారు.

కాగా.. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదాలను ఎదుర్కోవడం వరుసగా ఇది మూడోసారి కావడం గమనార్హం. గురువారం ముంబయి - గాంధీనగర్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు.. అహ్మదాబాద్‌ సమీపంలోని వట్వా రైల్వేస్టేషను వద్ద గేదెలను ఢీకొనడంతో ముందు భాగం దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత శుక్రవారం మధ్యాహ్నం గాంధీనగర్‌ నుంచి ముంబయికి బయలుదేరిన రైలు వంద కి.మీ.ల దూరంలోని ఆనంద్‌ స్టేషను సమీపంలో ఆవును ఢీకొంది. మళ్లీ ముందుభాగం నొక్కుకుపోయి రైలు పది నిమిషాలు ఆగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని