Varun Gandhi: ఉచిత రేషన్ సరే.. ఆ రూ.10 లక్షల కోట్ల మాటేంటి..?

పలు అంశాల్లో సొంతపార్టీపైనే విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతుంటారు భాజపా నేత వరుణ్ గాంధీ. 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్ అందించిన ప్రభుత్వానికి తప్పక అభినందనలు తెలపాలంటూ భాజపా ఎంపీ ఒకరు పార్లమెంట్‌లో పేర్కొన్న నేపథ్యంలో..ఈయన ట్విటర్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు.

Updated : 10 Aug 2022 11:21 IST

దిల్లీ: పలు అంశాల్లో సొంతపార్టీపైనే విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతుంటారు భాజపా నేత వరుణ్ గాంధీ. 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్ అందించిన ప్రభుత్వానికి తప్పక అభినందనలు తెలపాలంటూ భాజపా ఎంపీ ఒకరు పార్లమెంట్‌లో పేర్కొన్న నేపథ్యంలో..ఈయన ట్విటర్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం మాఫీ చేసిన మొండి బకాయిల మొత్తాన్ని పోల్చుతూ ట్వీట్ చేశారు. 

‘పేదలకు 5కేజీల ఉచిత రేషన్ అందించి కృతజ్ఞతలు ఆశిస్తోన్న ఈ సభ.. గత ఐదు సంవత్సరాల కాలంలో రూ.10 లక్షల కోట్ల మొండి బకాయిలు మాఫీ చేసినట్లు చెప్తోంది. ఈ ఉచితాల జాబితాలో మెహుల్ చోక్సీ, రిషి అగర్వాల్  పేర్లు ముందు వరుసలో ఉన్నాయి. దీనిని బట్టి ప్రభుత్వ నిధుల్లో మొదటి హక్కు ఎవరికి ఉంది..?’ అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. అలాగే మాఫీ చేసిన మొండి బకాయిల వివరాలను ఆర్థిక శాఖ వెల్లడించగా.. వాటిని కూడా తన ట్వీట్‌కు జత చేశారు. ఈ పోస్టులో ఆయన ముఫ్త్‌ కీ రేవ్డీ(జనాకర్షకాలు) అనే పదాన్ని వాడారు. 

ఆ రేవ్డీ పదాన్ని ఇటీవల ప్రధానిమోదీ ప్రయోగించారు. ఓట్ల కోసం ఇచ్చే ఉచిత హామీలు దేశాభివృద్ధికి అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తూ దీనిని వాడారు. ఈ ఉచితాల పట్ల ప్రజలు, ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉండగా.. ప్యాకేజీ ఆహారపదార్థాలపై జీఎస్టీ, అగ్నిపథ్‌ పథకం, ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రశ్నాప్రతం లీకేజీ వ్యవహారం.. ఇలా ప్రతి అంశంపై వరుణ్‌ సూటిగా ప్రశ్నలు వేస్తూ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెడుతుంటారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని