Varun Singh: నా కొడుకు యోధుడు.. దేశ ప్రజలందరి ప్రార్థనలు బతికిస్తాయి..!

సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న సైనిక హెలికాప్టర్‌ కూలిన దుర్ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఐఏఎఫ్‌ గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌కు..  బెంగళూరులోని కమాండ్‌

Published : 11 Dec 2021 19:19 IST

బెంగళూరు: సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న సైనిక హెలికాప్టర్‌ కూలిన దుర్ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఐఏఎఫ్‌ గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌కు..  బెంగళూరులోని కమాండ్‌ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆయన పరిస్థితి ఇంకా విషయంగానే ఉందని వరుణ్‌ తండ్రి, కల్నల్‌ కేపీ సింగ్‌(రిటైర్డ్‌) తెలిపారు. అయితే తన కుమారుడు ఓ యోధుడని, మృత్యువుతో చేస్తోన్న ఈ యుద్ధంతో తప్పకుండా గెలిచివస్తాడని అన్నారు. ఈ దేశ ప్రజలందరి ప్రార్థనలు తన కొడుకును బతికిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. 

ప్రస్తుతం బెంగళూరులోనే ఉన్న కేపీ సింగ్‌ ఫోన్లో పీటీఐతో మాట్లాడారు. ‘‘వరుణ్‌  ఆరోగ్యస్థితిలో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ఇప్పుడూ ఏం చెప్పలేం. అయితే ప్రతి గంటకూ వైద్యులు వరుణ్‌ను పరీక్షిస్తున్నారు. బెస్ట్‌ ఆసుపత్రిలో నిపుణులైన వైద్యులు చికిత్స చేస్తున్నారు. నా కుమారుడి కోసం యావత్‌ దేశం ప్రార్థిస్తోంది. అతడి గురించి తెలియని వాళ్లు కూడా ఆసుపత్రికి వచ్చి వరుణ్‌ను చూడాలని అడగటం కదిలిస్తోంది. వారంతా వరుణ్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. దేశ ప్రజలందరి ప్రార్థనలు నా కుమారుడిని బతికిస్తాయి. అతడో యోధుడు. ఈ యుద్ధంలో గెలిచి వస్తాడు. తప్పకుండా కోలుకుంటాడు’’ అంటూ భావోద్వేగం చెందారు. 

డిసెంబరు 8న తమిళనాడులో జరిగిన హెలికాప్టర్‌ దుర్ఘటనలో మొత్తం 13 మంది మరణించగా.. వరుణ్‌ సింగ్‌ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరులోని కమాండో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాలతో పోరాడుతున్నారు. ఆయన పరిస్థితి విషమమే అయినప్పటికీ నిలకడ స్థితిలోనే ఉందని వైద్యులు తెలిపారు. 

భారత వాయుసేనలో వరుణ్‌ విశేష సేవలందించారు. గతేడాది తాను నడుపుతున్న తేజస్‌ యుద్ధ విమానంలో సాంకేతిక లోపం తలెత్తినప్పటికీ.. ఎంతో నైపుణ్యాన్ని, ధైర్య సాహసాలు ప్రదర్శించి ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. ఇందుకు గానూ.. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో ఆయనను శౌర్య చక్ర అవార్డుతో సత్కరించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని