ఆస్ట్రాజెనెకా టీకా వేయించుకున్న బ్రిటన్‌ ప్రధాని

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ శుక్రవారం తొలిడోసు కరోనా వైరస్‌ టీకా తీసుకున్నారు. లండన్‌లో సెయింట్‌ థామస్‌ ఆస్పత్రిలో ఆస్ట్రాజెనికా టీకాను వేయించుకున్నారు.

Updated : 20 Mar 2021 09:52 IST

లండన్‌: ప్రతి ఒక్కరూ తమ వంతు వచ్చినప్పుడు కరోనా వైరస్‌ టీకా తీసుకోవాలని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ విజ్ఞప్తి చేశారు. ఆయన శుక్రవారం తొలిడోసు టీకా తీసుకున్నారు. లండన్‌లో సెయింట్‌ థామస్‌ ఆస్పత్రిలో ఆస్ట్రాజెనెకా టీకాను వేయించుకున్నారు. అంతేకాకుండా తాను తీసుకోవడం ద్వారా ఈ టీకా సురక్షితమేనని ప్రజల్లో భరోసా కలిగించారు. ఈ మేరకు ఆయనే ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

‘టీకా వేయించుకోవడం మంచి అనుభూతిని కలిగించింది. టీకా ప్రక్రియ చాలా త్వరగా అయిపోయింది. ప్రజలు సైతం ప్రతి ఒక్కరూ తమ వంతు వచ్చినప్పుడు.. కేంద్రానికి వెళ్లి టీకా వేయించుకోవాలి. టీకా తీసుకోవడం మీకు, మీ కుటుంబానికి మంచి పరిణామం. ఆస్ట్రాజెనెకా టీకా వినియోగానికి ఐరోపాకు చెందిన శాస్త్రవేత్తలు అనుమతిని పునరుద్ధరించారు’ అని జాన్సన్‌ తెలిపారు. మరోవైపు ఫ్రాన్స్‌‌ ప్రధాని జీన్‌ కాస్టెక్స్‌ సైతం ఆస్ట్రాజెనెకా టీకాను వేయించుకున్నారు. అనంతరం ఓ టీవీతో మాట్లాడుతూ.. ‘కొవిడ్‌ ముప్పు నుంచి బయటపడేందుకు.. టీకా వేయించుకోవడమే అత్యుత్తమం’ అని జీన్‌ పేర్కొన్నారు.

బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ గతేడాది కరోనా వైరస్‌ బారిన పడిన విషయం తెలిసిందే. లండన్‌లోని సెయింట్‌ థామస్‌ ఆస్పత్రిలో వారం రోజులు చికిత్స పొందారు. తాను ప్రాణాలతో బయటపడటానికి వైద్యులే కారణమని జాన్సన్‌ అప్పట్లో అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని