Jagdeep Dhankhar: మీ దగ్గర ఔషధం ఉందా?:ధన్‌ఖడ్‌

పార్లమెంట్‌ (Parliament)లో విపక్షాల మైక్‌లు నిలిపివేశారంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) వ్యాఖ్యానించడంపై ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ (Jageep Dhankhar) మరోసారి విమర్శలు గుప్పించారు. పార్లమెంట్‌గౌరవాన్ని పునరుద్ధరించడానికి ఔషధాన్ని అభివృద్ధి చేయాలని అన్నారు.

Published : 11 Mar 2023 22:24 IST

దిల్లీ: పార్లమెంట్‌ (Parliament) గౌరవాన్ని పునరుద్ధరించడానికి ఏదైనా ఔషధం ఉందా?అని ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ (Jagdeep Dhankhar) ప్రశ్నించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ (UttarPradesh) లోని మీరట్‌లో పతంజలి (patanjali) ఆయుర్వేద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్‌లో విపక్ష నేతల మైక్‌లను నిలిపివేశారంటూ బ్రిటన్‌లో రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యానించడాన్ని పరోక్షంగా ఆయన విమర్శించారు. ‘‘భారత్‌లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ పార్లమెంట్‌లో విపక్ష నేతల మైక్‌లను నిలిపివేశారంటూ కొందరు మాట్లాడుతున్నారు. ఇంతకంటే పెద్ద అబద్ధం మరొకటి ఉండదు’’ అని ధన్‌ఖడ్‌ అన్నారు. చట్టసభల గౌరవాన్ని పునరుద్ధరించేందుకు ఎలాగైనా ఓ ఔషధాన్ని అభివృద్ధి చేయాలని పతంజలి ఎండీ బాలకృష్ణకు సూచించారు. రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్‌ గౌరవాన్ని కాపాడాలనే తపనతోనే ఈ విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. పార్లమెంట్‌, శాసనసభల్లో ప్రవర్తన ఆదర్శప్రాయంగా ఉండాలని, అక్కడ ఎలాంటి అవాంతరాలు ఏర్పడకూడదని ధన్‌ఖడ్‌ వ్యాఖ్యానించారు.

ఇటీవల బ్రిటన్‌లో పర్యటించిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ.. ఓ సమావేశంలో మాట్లాడుతూ.. భారత పార్లమెంటులో విపక్ష నేతల మైక్‌లను నిలిపివేశారంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గతంలోనూ ధన్‌ఖడ్‌ తీవ్రంగా స్పందించారు. ప్రపంచమంతా భారత చరిత్రాత్మక విజయాలను ప్రశంసిస్తున్న వేళ కొందరు పార్లమెంటేరియన్లు అనాలోచిత వ్యాఖ్యలతో దేశ ప్రతిష్ఠను మంటగలుపుతున్నారని విమర్శించారు. ఓ పార్లమెంటు సభ్యుడు విదేశాల్లో మన దేశ పరువును తీస్తుంటే రాజ్యాంగ పదవిలో ఉన్న తాను మౌనం వహించడం సరికాదని అన్నారు. పార్లమెంటు కమిటీల్లో వ్యక్తిగత సిబ్బందిని నియమించుకున్నారంటూ తనపై వచ్చిన విమర్శలపైనా ధన్‌ఖడ్‌ స్పందించారు. కమిటీ సభ్యులైన ఎంపీలకు పరిశోధన అంశాల్లో తోడ్పాటుగా ఉంటారనే ఉద్దేశంతోనే వారికి సహాయకులను నియమించానని రాజ్యసభ ఛైర్మన్‌ సమర్థించుకున్నారు. వాస్తవమేమిటో తెలుసుకోకుండానే మీడియా ఆరోపణలు చేసిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని