
Republic Day: భారతీయుల ఆశల, ఆకాంక్షలకు ప్రతీక.. మన రాజ్యాంగం
దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా పలువురి శుభాకాంక్షలు
దిల్లీ: 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ నిర్మాతల కృషి, స్వాతంత్ర్య సమరయోధులు, దేశ జవాన్ల త్యాగాలను గుర్తుచేసుకున్నారు.
* దేశ ప్రజలకు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన రాజ్యాంగంలో పొందుపర్చిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమన్యాయం వంటి ప్రతిష్ఠాత్మక సూత్రాలపై మన విశ్వాసాన్ని పునరుద్ఘాటించేందుకు గణతంత్ర దినోత్సవం సరైన వేదిక. గణతంత్ర రాజ్య ఆవిర్భానికి కారణమైన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవాల్సిన సమయమిది. గణతంత్ర రాజ్యంలో మన సాధించిన లక్ష్యాలను వేడుకగా జరుపుకుందాం. ప్రగతిశీల, శాంతియుత భారతాన్ని నిర్మించుకునేందుకు అంకితమవ్వాలని సంకల్పించుకుందాం - ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
* దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్ - ప్రధాని మోదీ
* 1950లో గణతంత్ర దినోత్సవం నాడు మన దేశం ఆత్మవిశ్వాసంతో సరైన దిశలో తొలి అడుగు వేసింది. సత్యం, సమానత్వం కోసం పడిన ఆ అడుగుకు వందనం.
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్! - కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ
* హ్యాపీ రిపబ్లిక్ డే. గణతంత్ర భారత గౌరవం, ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు తమ జీవితాలను అంకింతం చేస్తోన్న జవాన్లందరికీ ఈ సందర్భంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉంటామని మనమంతా నేడు ప్రతిజ్ఞ చేద్దాం - కేంద్రమంత్రి అమిత్ షా
* ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనదే. బాబా సాహెబ్ భీమ్రావ్ అంబేడ్కర్ రచించిన ఈ రాజ్యాంగం.. ప్రతి భారతీయుడి ఆశలు, ఆకాంక్షలకు ప్రతీక. దేశ ప్రజలందరికీ 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు - దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్