Hathras Stampede: ఆచూకీ లేని ‘భోలే బాబా’.. బాధితుల్లో ఆక్రోశం!

మృతదేహాలను గుర్తించేందుకు మార్చురీలకు ఓవైపు.. గాయపడిన వారి కోసం ఆసుపత్రులకు పరుగులు తీయడం మరోవైపు.. తమవారి ఆచూకీ ఇంకా దొరకలేదంటూ అధికారులను పలువురు ప్రాధేయపడుతున్న యూపీలోని దృశ్యాలు కలిచివేస్తున్నాయి.

Published : 04 Jul 2024 16:55 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో తొక్కిసలాటకు కారణమైన భోలే బాబా ‘సత్సంగ్‌’ వందల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. తమ ఆత్మీయులను గుర్తించేందుకు పలువురు పడుతోన్న ఆరాటం అందరినీ కలచివేస్తోంది. మృతదేహాలను గుర్తించేందుకు మార్చురీలకు.. గాయపడిన వారి కోసం ఆసుపత్రుల వైపు పరుగులు తీయడం.. ఇంకోవైపు తమవారి ఆచూకీ ఇంకా దొరకలేదని అధికారులను ప్రాధేయపడుతున్న దృశ్యాలే దర్శనమిచ్చాయి. ఇన్ని రోజులూ భోలే బాబాను విశ్వసించిన భక్తులే.. ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వాతావరణం నెలకొంది. నిజంగా తమను రక్షించే ఉద్దేశం ఉంటే.. వెంటనే ఆయన వచ్చి తమ బాధలను విని, సాయం చేయాలని వేడుకొంటున్నారు.

జైలుకెళ్లి.. బాబాగా మారి.. ‘భోలే’ పాదధూళి కథేంటీ?

ఇలా రెండు రోజులుగా బాధిత కుటుంబీకుల రోదనలతో హాథ్రస్‌, అలీగఢ్‌, ఆగ్రా, ఎటా ప్రాంతాలు విషాదంతో నిండిపోయాయి. ఈ క్రమంలోనే తొక్కిసలాటలో చనిపోయిన 121 మంది మృతదేహాలను గుర్తించి, వారి కుటుంబీకులకు అప్పగించినట్లు జిల్లా అధికారులు వెల్లడించారు. మరో 31 మంది చికిత్స పొందుతున్నారని, కనిపించకుండా పోయిన వారు ఎవరూ లేరని చెప్పారు.

ఎఫ్‌ఐఆర్‌లో లేని ‘బాబా’

తొక్కిసలాట జరిగినప్పటి నుంచి భోలే బాబా ఆచూకీ కనిపించడం లేదు. అసాంఘిక శక్తులు దీనివెనుక ఉండొచ్చంటూ బుధవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేసినప్పటికీ.. అతడి భద్రతా సిబ్బంది తోయడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఎఫ్‌ఐఆర్‌లోనూ ‘బాబా’ పేరు ఇంకా చేర్చలేదు. కేవలం కొందరు నిర్వాహకులు, సహాయకులనే నిందితులుగా చేర్చినట్లు తెలుస్తోంది.

బాధితుల్లో ఆక్రోశం..

ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన వారి కుటుంబీకుల్లో తీవ్ర ఆక్రోశం వ్యక్తమవుతోంది. ఇన్ని రోజులు బాబాను విశ్వసించిన వారు.. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. బాబాకు శక్తులే ఉంటే, నిజంగా తమను రక్షించే ఉద్దేశం ఉంటే.. వెంటనే వచ్చి తమ బాధలను విని, తగిన సాయం చేయాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు. సత్సంగ్‌కు వెళ్లి తన తల్లీ, భార్య, కుమార్తె చనిపోయారని హాథ్రస్‌కు చెందిన ఓ యువకుడు వాపోతూ.. తన ఇంట్లోని బాబా పోస్టర్లును చించిపారేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.

ఆరుగురు అరెస్టు..

భోలే బాబా సత్సంగ్‌ కార్యక్రమానికి 80వేల మంది కోసం అనుమతి తీసుకోగా.. దాదాపు రెండున్నర లక్షల మంది హాజరైనట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్‌’ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా కార్యక్రమ నిర్వాహకుడు సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు, యూపీ తొక్కిసలాట నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ హాథ్రస్‌ను సందర్శించి, బాధితులను పరామర్శిస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని