చంద్రబాబు ప్రమాణస్వీకారం వేళ.. అమిత్‌ షా, తమిళిసై చర్చించుకుంటున్న వీడియో వైరల్‌

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amit Shah), భాజపా నాయకురాలు తమిళిసై (Tamilisai Soundararajan) ఏదో అంశంపై చర్చించుకున్నారు. ఆ వివరాలేవీ బయటకురాకపోయినా.. వారు చర్చించుకుంటున్న దృశ్యాలు మాత్రం వైరల్‌గా మారాయి. 

Updated : 12 Jun 2024 18:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆంధ్రపదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేశారు. ఆ వేడుకకు దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah), తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ (Tamilisai Soundararajan) ఏదో అంశంపై సీరియస్‌గా చర్చించుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది.

ప్రమాణస్వీకార కార్యక్రమానికి అతిథిగా వచ్చిన తమిళిసై.. వేదికపై కూర్చున్న నేతలను పలకరిస్తూ ముందుకువెళ్లారు. అక్కడే ఉన్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అమిత్‌ షాను ఆమె పలకరించారు. ఆ తర్వాత ఆమె అక్కడినుంచి ముందుకువెళ్తుంటే.. అమిత్‌ షా ఆమెను వెనక్కి పిలిచారు. తర్వాత వారిద్దరి మధ్య సంభాషణ జరిగింది. అది కాస్త సీరియస్‌గానే ఉన్నట్లు కనిపించింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దానిపై నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తంచేశారు. భాజపా తమిళనాడు విభాగంలో నేతల మధ్య అంతర్గత విభేదాల గురించే ఆ చర్చ అని కొందరు కామెంట్‌ చేశారు.

ఈ వీడియోపై తమిళనాడు అధికార పార్టీ డీఎంకే(DMK) స్పందించింది. ‘‘తమిళనాడుకు చెందిన ఒక ప్రముఖ నాయకురాలిని ఇలా బహిరంగంగా మందలించడం తగునా? ఇది అందరు చూస్తారని తెలుసుకోవాలి. ఇది తప్పుడు సంకేతాన్ని పంపుతుంది’’ అని విమర్శించింది. లోక్‌సభ ఎన్నికల అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై, తమిళిసై మధ్య విబేధాలు తలెత్తాయని వార్తలు వచ్చాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రాష్ట్ర నాయకత్వంపై ఆమె  తన అసంతృప్తిని వ్యక్తంచేశారు. ఇది రెండు వర్గాల మద్దతుదారుల మధ్య ఆన్‌లైన్ వేదికగా మాటల యుద్ధానికి దారితీసింది. ఈ ఎన్నికల్లో అక్కడ కమలం పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అన్నామలై వ్యవహారశైలి కారణంగా అన్నాడీఎంకే, భాజపాల మధ్య పొత్తు వీగిపోయిందని, అది భారీ ఓటమికి దారితీసిందనే విమర్శా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. దీనిపై తమిళిసై నుంచి స్పందన రావాల్సిఉంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని