Video: ఇదేం తీరు.. మహిళల్ని చూసినా బస్సు ఆపరా? డ్రైవర్‌పై వేటు..

బస్‌ స్టాప్‌లో వేచిచూస్తున్న మహిళల్ని చూసినా సరే బస్సు ఆపకుండా వెళ్లిపోయిన డ్రైవర్‌ను దిల్లీ సర్కార్‌ సస్పెండ్‌ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్‌ చేసిన సీఎం కేజ్రీవాల్‌.. ఇలాంటి ఘటనల్ని ఉపేక్షించబోమని హెచ్చరించారు.

Published : 18 May 2023 18:10 IST

దిల్లీ: దేశ రాజధాని నగరంలోని ఓ బస్‌ స్టాండ్‌లో బస్సు వేచిచూస్తోన్న మహిళల్ని ఎక్కించుకోకుండా వెళ్లిపోయిన ఓ బస్సు డ్రైవర్‌ తీరుపై దిల్లీ(Delhi) ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అతడిని ఉద్యోగంలోంచి సస్పెండ్‌ చేసినట్టు ప్రకటించింది. దిల్లీలోని ఓ బస్టాండ్‌లో తాజాగా చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌(Viral Video)గా మారింది. దీంతో దిల్లీ ప్రభుత్వం(Kejriwal Government) సీరియస్‌గా స్పందించింది. వీడియోలో రికార్డయిన దృశ్యాలను గమనిస్తే.. ముగ్గురు మహిళలు ఓ బస్‌ స్టాప్‌లో వేచి చూస్తున్నారు.  అయితే, బస్సులోని ఓ ప్రయాణికుడిని దించేందుకు బస్సును నెమ్మదిగా పోనిచ్చిన డ్రైవర్‌.. అక్కడ ఎదురుచూస్తూ బస్సు వెనుక పరుగులు పెడుతున్న మహిళల్ని ఎక్కించుకోకుండానే వెళ్లిపోయినట్టు ఆ వీడియోలో రికార్డయింది.  ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి రావడంతో ఆ డ్రైవర్‌ను గుర్తించి సస్పెండ్‌ చేసినట్టు అధికారులు వెల్లడించారు. 

ఇలాంటివి ఉపేక్షించం.. సీఎం కేజ్రీవాల్‌ వార్నింగ్‌

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. కొందరు డ్రైవర్లు మహిళా ప్రయాణికుల కోసం బస్సు ఆపడంలేదని.. అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినప్పటి నుంచి బస్సు డ్రైవర్లు వారిని చూసినా బస్సులు ఆపకుండా వెళ్తుండటంపై ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఇలాంటి వాటిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించబోమన్నారు. నిర్ణీత బస్‌ స్టాప్‌లలో కచ్చితంగా బస్సులు ఆపాల్సిందేనని మహిళా, పురుష డ్రైవర్లను ఆదేశిస్తూ ట్వీట్‌చేశారు.  సీఎం చేసిన ట్వీట్‌ను జత చేస్తూ దిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాశ్‌ గహ్లోత్‌ స్పందించారు. ఇలాంటి ఘటనలకు సంబంధించి వీడియోలను తీసి వాటిని ప్రభుత్వానికి పంపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ప్రవర్తన ఆమోద యోగ్యం కాదన్న ఆయన.. ఇలా ప్రవర్తించిన డ్రైవర్‌, ఇతర సిబ్బందిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే, సీఎం కేజ్రీవాల్‌ ఆదేశాల మేరకు డ్రైవర్‌ను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు విధుల నుంచి తొలగించినట్టు చెప్పారు. అంతేకాకుండా డ్రైవర్‌, ఇతర సిబ్బందిపై విచారణ ప్రారంభించినట్టు వెల్లడించారు.  2019అక్టోబర్‌ 29 నుంచి డీటీసీతో పాటు క్లస్టర్‌ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు